Child Death: చిన్నారికి గుండెపోటు... ఆడి పాడే చిన్నారికి నాలుగేళ్ళకే నూరేళ్ళు నిండాయి.
Child Death: బుడిబుడి అడుగులతో ఆడిపాడుతూ అందరికి అబ్బురపరిచే చిన్నారి గుండే ఆగింది. నాలుగేళ్ళకే నూరేళ్ళు నిండాయి. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. చిన్నారి ఆటపాటలు కళ్ళముందు కదలాడుతు చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.
Child Death: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నాలుగేళ్ళ చిన్నారి మేడిపల్లి ఉక్కులు అలియాస్ శ్రీయన్ష్ గుండెపోటుతో మృతి చెందింది. జమ్మికుంటలో ప్రైవేట్ ఫైనాన్స్ లో ఉద్యోగం చేసే రాజు-జమున దంపతుల కూతురు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తు చూపరులను అలరించే చిన్నారి అనూహ్యంగా అస్వస్థతకు గురయింది.
వెంటనే తల్లిదండ్రులు హన్మకొండ లోని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయింది. లంగ్స్ ఇన్ ఫెక్షన్ తో హార్ట్ స్ట్రోక్ కు గురైనట్లు డాక్టర్ లు నిర్దారించారు. ఆటపాటలతో అందరిని ఆకట్టుకునే చిన్నారి అనూహ్యంగా అస్వస్థతకు గురై గుండే ఆగిపోవడంతో కన్నవారు తోపాటు బంధుమిత్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
చిన్నారి చిచ్చర పిడుగు…
చిన్నారి ఉక్కులు నాలుగేళ్ళ వయస్సు లోనే చిచ్చర పిడుగు లా వ్యవహరించింది. ఏ పాట అయిన సరే దానికి అనుగుణంగా డాన్స్ చేసి చూపరులను అబ్బురపరిచేది. చిన్నారికి అన్న ఉన్నా అతని కంటే యాక్టివ్ గా ఆటపాటలతో అందరిని ఆకట్టుకునేది. ఎప్పుడు అనారోగ్యానికి గురి కాని చిన్నారి అనూహ్యంగా అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోవడంతో జమ్మికుంట తోపాటు వారి స్వస్థలం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది.
చిన్నారి హార్ట్ స్ట్రోక్ ఆశ్చర్యం..
అతి చిన్న వయసుగల నాలుగేళ్ల చిన్నారికి హార్ట్ స్ట్రోక్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆడుతూ పాడుతూ ఎంతో చలాకీగా ఉండే చిన్నారికి అసలు ఏమైందనే పరిస్థితి ఏర్పడింది. యువకులు, నడిఈడు వృద్ధులకు గుండెపోటు రావడం సహజం కానీ నాలుగేళ్ల చిన్నారికి గుండెపోటు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ చిన్నారికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించలేక పోయారు. ఆటపాటలతో చలాకీగా ఉండడం వల్ల చిన్నారి ఆరోగ్యంగా ఉందని పేరెంట్స్ తో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆ లంగ్స్ ఇన్ ఫెక్షన్ హార్ట్ పై ప్రభావం చూపి స్ట్రోక్ వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు.
కంటతడి పెట్టిస్తున్న చిన్నారి డ్యాన్స్..
హార్ట్ స్ట్రోక్ తో చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్ళగా ప్రస్తుతం ఆమె చేసిన నృత్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పేరెంట్స్ ప్రోత్సాహంతో బుడిబుడి అడుగుల నుంచి స్టెప్పులు వేసిన చిన్నారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నారి భౌతికంగా లేకపోయినా ఆమె డ్యాన్స్ కన్నవారికి తీపి గుర్తులుగా మిగిలాయి. చిన్నారి నృత్యాలను చూసిన వారు అయ్యే పాపం బిడ్డకు అప్పుడే నూరేళ్ళు నిండాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)