Warangal: నడిరోడ్డుపై 9 ఎంఎం గన్.. ఎవరికైనా దొరికితే ఏంటీ పరిస్థితి!-a 9 mm gun belonging to crpf police fell on the road in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal: నడిరోడ్డుపై 9 ఎంఎం గన్.. ఎవరికైనా దొరికితే ఏంటీ పరిస్థితి!

Warangal: నడిరోడ్డుపై 9 ఎంఎం గన్.. ఎవరికైనా దొరికితే ఏంటీ పరిస్థితి!

Basani Shiva Kumar HT Telugu
Aug 24, 2024 04:44 PM IST

Warangal: సమయం తెల్లవారుజామున 5 గంటలు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ సమయంలో సీఆర్పీఎప్ పోలీసుల వాహనం ఆ రోడ్డు గుండా వెళ్లింది. అప్పుడు వారికి చెందిన 9 ఎంఎం గన్ రోడ్డుపై పడిపోయింది. అది ఓ ఆటో డ్రైవర్‌కు దొరికింది. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది.

నడిరోడ్డుపై 9 ఎంఎం గన్
నడిరోడ్డుపై 9 ఎంఎం గన్ (Wikipedia )

వరంగల్ నగరంలో 9 ఎంఎం గన్ నడిరోడ్డుపై దొరకడం సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తు ఆ గన్ ఏ క్రిమినల్‌కు దొరకలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ గన్ ఏ రౌడీషీటర్‌కో దొరికితే పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు. అయితే.. ఆ గన్‌ను ఓ ఆటో డ్రైవర్ క్షేమంగా పోలీసులకు అప్పగించారు.

ఏం జరిగిందంటే..

హనుమకొండ సమీపంలోని బీమారంలో సీఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ క్యాంప్ ఉంది. ఆ శిబిరాన్ని శుక్రవారం మణిపూర్‌కు తరలిస్తున్నారు. ఉదయం 5 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక వాహనంలో వెళ్తున్నారు. వారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ నుంచి ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో రిలయన్స్ మాల్ వద్ద సీఆర్పీఎఫ్ పోలీసుల వాహనం నుంచి ఓ 9 ఎంఎం గన్ కింద పడిపోయింది. దాన్ని వారు గమనించకుండా అలాగే వెళ్లిపోయారు.

ఆటో డ్రైవర్‌ను అభినందించాల్సిందే..

తెల్లవారుజామున కావడంతో పెద్దగా జనసంచారం లేదు. దీంతో ఆ గన్‌ను ఎవరూ గుర్తించలేదు. అయితే.. కాసేపటికి ఆ రోడ్డుపై ఓ ఆటో వెళ్తుంది. ఆ ఆటో డ్రైవర్ ధరావత్ శ్రీను గన్‌ను చూశారు. దాన్ని తీసుకొని వెంటనే మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఠాణాలో ఉన్న సిబ్బందికి ఆ గన్‌ను భద్రంగా అప్పగించాడు. ఆ గన్‌ను మట్టెవాడ పోలీసులు భద్రపరిచారు.

పోయిందని గ్రహించి..

ఇది జరిగిన తర్వాత.. గన్ మిస్సైన విషయాన్ని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాజేష్ కుమార్ గ్రహించారు. వెంటనే ఆయన కూడా మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం చెప్పగా.. ఉన్నతాధికారుల సూచనతో ఆయన్ను విచారించి గన్‌ను అప్పగించారు. గన్‌ను బాధ్యతగా తీసుకొచ్చి అప్పగించిన ఆటో డ్రైవర్ శ్రీనును పోలీసులు అభినందించారు. అయితే.. ఆ గన్‌లో బుల్లెట్లు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు భావిస్తున్నారు.

వేరే వారికి దొరికితే..

వరంగల్ నగరంలో ఈ మధ్య క్రైమ్ సంఘటనలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో.. ఈ గన్ వేరే వారికి దొరికితే ఏంటీ పరిస్థితి అనే చర్చ నడుస్తోంది. నేరాలకు పాల్పడే వారికి ఈ గన్ దొరికితే పెద్ద ముప్పు ఉండేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ గన్ మళ్లీ సీఆర్పీఎఫ్ సిబ్బంది చేతిలోకి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయుధాలు రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.