Karimnagar : అమాన‌వీయ ఘటన... 3 రోజుల మగ శిశువును కెనాల్ పక్కన పడేశారు..!-a 3 days old baby boy was wrapped in a bag and dumped near the canal in karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : అమాన‌వీయ ఘటన... 3 రోజుల మగ శిశువును కెనాల్ పక్కన పడేశారు..!

Karimnagar : అమాన‌వీయ ఘటన... 3 రోజుల మగ శిశువును కెనాల్ పక్కన పడేశారు..!

HT Telugu Desk HT Telugu
Sep 12, 2024 10:11 PM IST

కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కన పడేశారు. పసికందు అరుపులతో స్థానికులు గమనించి… పోలీసుల సమక్షంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

కరీంనగర్‌లో దారుణం - .కెనాల్ వద్ద 3 రోజుల శిశువు గుర్తింపు
కరీంనగర్‌లో దారుణం - .కెనాల్ వద్ద 3 రోజుల శిశువు గుర్తింపు

హుజురాబాద్ మండలం తుమ్మలపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన పసికందు అరుపులు స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అటుగా వెళ్ళిన రైతు చొక్కా రెడ్డి భయాందోళనకు గురై గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు నలుగురైదుగురు కలిసి మూటవిప్పి చూడగా చీమలుపట్టిన మగశిశువును చూసి ఆవేదన చెందారు. సిఐ తిరుమల్ అక్కడికి చేరుకుని హుటాహుటిన హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పసిబాలుడు కోలుకుంటున్నాడు.

ఎవరు పడేశారు…?

ఆడ శిశువును లింగ వివక్షతతోనో, పోషించడం భారంగా భావించో పడేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ, మగ శిశువును పడేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఏ తల్లి కన్న బిడ్డో తెలియదు కానీ పండంటి బాబును పడేయడానికి చేతులు ఎలా వచ్చాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ సంబంధంతో పుట్టిన బాబో లేక సక్రమ సంబంధంతో పుట్టి కుటుంబ కలహాలతో పడేయాల్సి వచ్చిందో తెలియదు కానీ మూట కట్టి పడేయడం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. 

ఆరా తీస్తున్న పోలీసులు…

పసికందును కన్న వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. హుజురాబాద్ రూరల్ సీఐ తిరుమల నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం హుజురాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల డెలివరీ అయిన వారి గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. 

మూడు రోజులు క్రితం పుట్టిన బాబు అని డాక్టర్లు నిర్ధారించడంతో నాలుగైదు రోజుల నుంచి పురిట్టినొప్పులతో ఉన్న వారు గ్రామాల్లో ప్రెగ్నెన్సీ లేడీస్ డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. అక్రమ సంబంధం వల్ల కలిగిన సంతానం కావడంతోనే మూట కట్టి పడేసి ఉంటారని భావిస్తున్నారు. పసికందును కన్నవారి ఆచూకీ కనుక్కునే పనులో నిమగ్నమై… కెనాల్ పక్కన బాబును పడేసిన గంటల వ్యవధిలోనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించిన స్థానికులను అభినందించారు. గతంలో సైతం ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని పోలీసులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అభం శుభం తెలియని పసికందు మూడు రోజుల క్రితం పుట్టినట్లు వైద్యులు నిర్థారించారు. పాలుపట్టకపోవడంతో వేట్ తగ్గి వీక్ అయ్యాడని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పసిబాలుడికి జాండిస్ అయ్యాయని… కాలుకు, చెతికి స్వల్ప గాయాలు ఉన్నాయని చెప్పారు. కోలుకోవాలంటే వారం రోజులు పడుతుందన్నారు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

పెద్దపల్లిలో పసిపాప మృతి - ఆస్పత్రిపై దాడి:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడు నెలల పాప మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన దిగారు. ఆసుపత్రి పై దాడి చేసి ఫర్నిచర్ ద్వంసం చేసి భీభత్సం సృష్టించారు. డాక్టర్ పై దాడికి యత్నించగా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. డాక్టర్ ను అప్పగించే వరకు కదలమని ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

పెద్దపల్లిలోని నల్ల పోచమ్మవాడలో నివాసం ఉండే ఖదీర్ తన ఏడు నెలల పాప అభియాకు నంజు ఉండడంతో స్థానిక శ్రీ సిద్ధార్థ పిల్లల ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ రాజేశ్ ఇంజెక్షన్ ఇచ్చి రెండు రోజులు వాడాలని సూచించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్ళిన వారు మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వగా అస్వస్థతకు గురయ్యింది. వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి రెపర్ చేయగా అక్కడికి వెళ్ళే సరికే పాప ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే పాప ప్రాణాలు కోల్పోయిందని భావిస్తు శవంతో పెద్దపల్లి ఆసుపత్రికి చేరి ఆందోళనకు దిగారు.

నంజు ఉందని ఆసుపత్రికి వెళ్ళింతే హై డోస్ ఇచ్చి పాప ప్రాణాలు తీశాడని పేషంట్ పేరెంట్స్ తో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహా వేషాలతో ఆసుపత్రి పై దాడి చేశారు. చేతికి అందిన వస్తువులను వదలకుండా అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసుపత్రి ఆనవాళ్లు లేకుండా చేసి బీభత్సం సృష్టించారు. 

డాక్టర్ పై దాడి చేసేందుకు యత్నించగా తృటిలో డాక్టర్ తప్పించుకుని పారిపోయాడు. దాడి ధ్వంసంతో మృతురాలి బంధువులకు రక్తగాయలు అయ్యాయి.‌ డాక్టర్ ను అప్పగించే వరకు కదిలేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయించి హంగామా చేశారు. డాక్టర్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు కదలమని బిస్మించారు. ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోమ్మని హెచ్చరించారు.

పసిపాప మృతితో ఆందోళన, దాడి ద్వంసంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అటు డాక్టర్ పైన మృతురాలి బంధువులు, మృతురాలు బందువులపై ఆసుపత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ రాజేష్ మాత్రం తన నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. 

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు