TG Samagra Kutumba Survey : ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి 9 కీలక అంశాలు
TG Samagra Kutumba Survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నంబరు, అందులో నివసించే వారి పేరు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రేపటికల్లా ఇళ్లు, యజమానుల జాబితా సిద్ధం కానుంది. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే చేపట్టనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటి నంబరు, ఆ ఇంట్లో నివసించే కుటుంబ యజమాని పేరు నమోదు ప్రక్రియ 6వ తేదీన ప్రారంభమైంది. ఒక్కో సర్వే అధికారికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించారు. రేపటి వరకూ నమోదు చేస్తారు. శక్రవారం వరకు రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయనే జాబితాలు సిద్ధం కానున్నాయి.
1.ఈ నెల 9వ తేదీ నుంచి సర్వే అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబాలలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. నెలాఖరులోగా దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2.ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసే కార్యక్రమంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
3.నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత వివరాలు సేకరించినట్లుగా సర్వే అధికారులు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు.
4.తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలున్నాయి. రాష్ట్రంలోని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
5.జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 28,32,490 కుటుంబాలున్నాయి. గ్రేటర్ పరిధిలో 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. మొత్తం సర్వే పూర్తిచేయడానికి 94,750 మంది సర్వే అధికారులు, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను ప్రభుత్వం నియమించింది.
6.రెండో దశలో ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నంబర్లు సహా సమస్త వివరాలను 75 ప్రశ్నలు అడిగి నమోదు చేసి కంప్యూటరీకరణ చేస్తారు.
7.సర్వే అధికారులు ఇంటికి వచ్చే సమయానికి ఆధార్, రేషన్‌కార్డులు సిద్ధంగా ఉంచుకుని కచ్చిన వివరాలను అందజేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
8.తెలంగాణలో చాలా కుటుంబాలకు తమ స్వగ్రామాల్లో ఇల్లు ఉన్నా.. ఉద్యోగం, వ్యాపార, చదువు రీత్యా నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్నారు. ఇలాంటివారు ఎక్కడ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకోవాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
9.ప్రతి వ్యక్తి ఆధార్ కార్డుపై ఏ చిరునామా ఉంటే అక్కడ వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రజలకు సులభంగా ఉండేలా ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.