నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శివంగి అని పేరు పెట్టారు. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీతో పాటు గ్రేహౌండ్స్‌కు దీటుగా ఈ టీమ్‌కు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ గ్రూప్ కార్యకలాపాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. టీమ్ శివంగికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను టీమ్ శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
2.ఎంపిక చేసిన వీరికి పురుష కమాండోలతో సమానంగా 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ సందర్భంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్ బాధ్యతలను అప్పగించారు.
3.శిక్షణలో భాగంగా వర్టికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పోరాట నైపుణ్యాలతో పాటు పేలుడు పదార్థాలు, వెపన్ ట్రైనింగ్, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించడం, ఫైరింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, ఆకస్మిక వ్యూహాల రచన, శత్రువుల కదలికలు గమనించడం, అడవుల్లో కూంబింగ్, నిఘా పద్ధతులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చారు.
4.నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలు ఇటీవల దట్టమైన అడవుల్లో తప్పిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల వెంటనే టీమ్ సివంగి కమాండో బృందాన్ని రంగంలోకి దింపారు.
5.ఎస్పీ నేతృత్వంలో మహిళ కమాండోలు దట్టమైన అడవిలో రాత్రంతా కూంబింగ్ నిర్వహించి, నలుగురు మహిళలను గుర్తించారు. పురుష కమాండోస్‌కు దీటుగా మహిళలు చీకట్లో, దట్టమైన అడవిలో కూంబింగ్ నిర్వహించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
6.నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ సివంగి గ్రూప్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇలాంటి టీమ్స్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
7.మహిళా కమాండోలతో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసిన ఎస్పీ జానకీ షర్మిలను మంత్రి సీతక్క అభినందించారు. మహిళా కమాండోల పరేడ్‌ను తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి టీమ్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే.. పోలీస్ శాఖకు అదనపు బలం చేకూరుతుందని, మహిళల్లో భరోసా పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
8.ఈ టీమ్‌కు అత్యాధునిక ఆయుధాలపై శిక్షణ ఇచ్చి.. వాటిని సమర్థవంతంగా ఉపయోగించేలా తీర్చిదిద్దారు. టీమ్ శివంగిని.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలోని ఇతర మహిళా పోలీసులకు స్ఫూర్తినిస్తుంది.
9.మొత్తానికి శివంగి టీమ్ నిర్మల్ పోలీసుల వినూత్న ప్రయత్నం. ఇది మహిళా పోలీసుల సామర్థ్యాన్ని చాటి చెప్పడమే కాకుండా.. క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయడానికి వారిని సన్నద్ధం చేస్తుంది.
సంబంధిత కథనం