Janwada Farm House : జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసలు ఏం జరిగింది? 9 ముఖ్యమైన అంశాలు ఇవే-9 important things that happened in the issue at janwada farm house from saturday night ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janwada Farm House : జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసలు ఏం జరిగింది? 9 ముఖ్యమైన అంశాలు ఇవే

Janwada Farm House : జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసలు ఏం జరిగింది? 9 ముఖ్యమైన అంశాలు ఇవే

Basani Shiva Kumar HT Telugu
Oct 27, 2024 06:08 PM IST

Janwada Farm House : జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఫామ్‌హౌస్ కేటీఆర్ బంధువులది అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.

జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?
జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?

జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ కేటీఆర్ బావమరిదిది అని ప్రచారం జరుగుతోంది. శనివారం రాత్రి నుంచి ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇవీ.

1.జన్వాడలోని రాజ్‌పాకాల ఫామ్ హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వేడుకలు నిర్వహించారు. భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తనిఖీలు చేసి 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.

2.జ‌న్వాడలోని రాజ్ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌లో రైడ్ చేసిన‌ప్పుడు 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 7 విదేశీ మ‌ద్యం బాటిళ్లు, 10 లోక‌ల్ మ‌ద్యం బాటిళ్లు, గేమింగ్ ఐట‌మ్స్‌ను గుర్తించినట్టు చెప్పారు. రాజ్ పాకాలపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

3.శనివారం రాత్రి రాజ్ పాకాల ఫాం హౌస్‌లో జరిగిన పార్టీ పై పోలీసుల పంచనామా రిపోర్ట్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ప్రకారం.. అక్కడ జరుగుతున్న విందు కార్యక్రమాన్ని పోలీసులు చెక్ చేసినపుడు.. ఎక్సైజ్ శాఖ నుండి పర్మిషన్ లేదని గుర్తించారు. అనుమతి లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు అని పంచనామాలో స్పష్టంగా పేర్కొన్నారు.

4.జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో కేటీఆర్ భార్య ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫేస్ కనిపించని ఓ మహిళను కేటీఆర్ భార్య అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారంతా హై ప్రోఫైల్ వ్యక్తులేనని సమాచారం.

5.నార్కోటిక్‌ కేసులో రాజ్‌పాకాల, మద్దూరిపై ఎఫ్ఐఅర్ నమోదు అయ్యింది. ఏ1గా రాజ్‌ పాకాల, ఏ2గా విజయ్‌ మద్దూరి పేర్లు నమోదు చేశారు. మోకిల పీఎస్‌లో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ఎస్ఐ కోటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

6.జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి శిక్ష పడాలన్నారు. సిట్ ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొందరు హైదరాబాద్ శివార్లను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు.

7.జన్వాడ ఫామ్‌హౌస్‌కి పోలీసులు రావడానికి కొద్దిసేపటి ముందే.. ఫామ్ హౌస్ నుంచి మాజీమంత్రి కేటీఆర్ వెళ్లిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

8.విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రేవ్ పార్టీ వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

9.అటు హైదరాబాద్‌లోని కేటీఆర్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కేటీఆర్ ఇంటికి రావడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కేపీ వివేకానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Whats_app_banner