TG Road Construction : తెలంగాణలో రోడ్లకు మహర్దశ.. జిల్లాల వారీగా ప్రణాళికలు.. 9 ముఖ్యమైన అంశాలు-9 important points regarding road development in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Road Construction : తెలంగాణలో రోడ్లకు మహర్దశ.. జిల్లాల వారీగా ప్రణాళికలు.. 9 ముఖ్యమైన అంశాలు

TG Road Construction : తెలంగాణలో రోడ్లకు మహర్దశ.. జిల్లాల వారీగా ప్రణాళికలు.. 9 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 30, 2025 02:25 PM IST

TG Road Construction : తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రోడ్ల అభివృద్ధి
రోడ్ల అభివృద్ధి (istockphoto)

తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల అభివృద్ధికి.. జిల్లాల వారీగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 27,700 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 25,643 కిలో మీటర్ల బీటీ, 882 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయి. మిగతావి కంకర, మట్టి రోడ్లు ఉన్నాయి. వీటిల్లో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని.. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

9 ముఖ్యమైన అంశాలు..

1.గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పలు చోట్ల రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గత ఏడాది భారీ వర్షాలకు పలు జిల్లాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గతంలో రోడ్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

2.ప్రధానంగా గ్రామీణ రోడ్లకు మహర్దశ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. అందులో భాగంగా జిల్లాల్లో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన విస్తరణ పనులు, కొత్త వంతెనలు, కల్వర్టుల నిర్మాణంపై అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేశారు.

3.ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం నిధులు సేకరించింది. త్వరలోనే రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధులను విడుదల చేయనుంది.

4.గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.15 కోట్లు మంజూరు చేశారు. వీటితో ప్యాచ్‌వర్క్‌లు చేశారు.

5.వర్షాలకు పాడైన 1,600 కిలో మీటర్ల రాష్ట్ర రోడ్లు, ప్రధాన జిల్లా రోడ్లు, 800 కిలోమీటర్ల మేర ఇతర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

6.తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని రోడ్ల అభివృద్ధి, వంతెనల నిర్మాణానికి ఒక్కొక్కరు రూ.50 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు.

7.కేంద్రం అందించే సీఆర్‌ఐఎఫ్‌ ఫండ్‌ను రోడ్ల అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి.

8.ఆర్‌ అండ్‌ బీకి చెందిన ప్రధాన ఎన్‌హెచ్, రాష్ట్ర రోడ్లను.. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ సంస్థకు టెండర్లు పిలవడంపై అధికారులు దృష్టి సారించారు.

9.అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. దీంతో చాలా గ్రామాల రూపురేఖలు మారిపోనున్నాయి.

Whats_app_banner