Holi 2025 : ఇలా చేస్తే ప్రమాదం.. హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. 9 ముఖ్యమైన అంశాలు
Holi 2025 : హోలీ.. కుల మతాలకు అతీతంగా అందరూ అనందంగా జరుపుకునే రంగుల పండగ. అయితే.. ఈ వేడుకల్లో జాగ్రత్తలు పాటించకపోతే.. ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ముప్పు తప్పదని చెబుతున్నారు.

మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొబ్బరి నూనెను చుట్టూ రాసుకున్న తరువాత మాత్రమే హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాలి. అందుబాటులో ఉంటే.. సన్ గ్లాస్ పెట్టుకోవాలి. దీనివల్ల ఆహ్లాదకరమైన లుక్స్ తోపాటు.. కళ్లకు సైతం రక్షణ కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు కళ్లలోకి రంగు చేరితే.. శుభ్రంగా కడగాలి. మీముఖాన్ని కిందకు వంచి కళ్లు తెరవడానికి ప్రయత్నించాలి.
కళ్లల్లో రంగులు పడితే.. అరచేతుల మధ్య నీళ్లను ఉంచుకుని కళ్లను మూసి తెరిచేందుకు ప్రయత్నించాలి. కళ్లలో నీళ్లు కొట్టడం చేయవద్దు. ఇలా చేస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రదనం మరింత ఎక్కువ కావడం, నీరు కారడం, దురద, అసౌకర్యంగా ఉండటం, ట్రౌమా, రక్తస్రావం అయితే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. కంటికి దగ్గరలో రంగులు పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.
9 జాగ్రత్తలు..
1) హోలీ ఆడడానికి సహజ రంగులు, హెర్బల్ కలర్స్ మాత్రమే ఎంచుకోవాలి.
2) కెమికల్ కలర్స్ చర్మానికి, కంటికి హాని చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది.
3) హోలీ ఆడే ముందు కొబ్బరి నూనె శరీరానికి, తలకు రాసుకోవాలి. దీనివల్ల కలర్స్ శరీరం లోపలికి పోకుండా జాగ్రత్త పడవచ్చు.
4) హోలీ ఆడే చేతులతో ఎలాంటి ఆహార పదార్ధాలు తినకూడదు.
5) రంగులు కళ్లల్లో పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే కంటి చూపు దెబ్బతినే ప్రమాదాలు ఎక్కువ.
6) చర్మ సంబందిత వ్యాధులు, ఎలర్జీ ఉన్నవారు హోలీ ఆడకపోవడమే మంచిది.
7) హోలీ ఆడాక ఎలాంటి దురదలు, ఎలర్జీ వచ్చినా ఆలస్యం చేయకుండా దగ్గరలో డాక్టర్‌ని సంప్రదించాలి.
8) హోలీ ఆడిన తర్వాత శుభ్రంగా తల స్నానం చేసి, పుదినా ఆకులు కానీ.. తులసి ఆకులను కానీ నీటిలో మరిగించి గోరువెచ్చగా తీసుకోవడం మంచిది.
9) తులసి లేదా పుదినా కాషాయం తీసుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ, జలుబు, గొంతు నొప్పి నుండి కాపాడుకోవచ్చు.