పోడు రైతుల కోసం.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగుకు మార్గం సుగమం కానుంది. పోడు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం అమలు కోసం అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రత్యేక కమిటీలను నియమించి.. అమలు చర్యలు చేపడుతున్నారు.
1.మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ పథకానికి బాధ్యులు. మండలాల్లో 9 మందితో కూడిన కమిటీ లబ్ధిదారులను గుర్తిస్తుంది.
2.ఇప్పటికే రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద పోడు పట్టాలు మంజూరయ్యాయి. వాటిల్లో బోరు వేసి సౌర విద్యుత్ కల్పించే బాధ్యత వీరు తీసుకుంటారు.
3.ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించనున్నారు. వారి వివరాలను వచ్చేనెల 10లోగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
4.భూగర్భ జలాలపై సర్వేను గిరిజన సంక్షేమ శాఖ చూసుకుంటుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31లోగా భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సౌర పంపుసెట్ల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
5.రెండున్నర ఎకరాలుంటే సింగిల్ యూనిట్, అంతకన్నా తక్కువ భూమి ఉంటే కొందరు రైతులను కలిపి పథకం కింద లబ్ధి చేకూర్చుతారు. వచ్చే ఐదేళ్ల కాలానికి.. ఏటా నిర్ణీత సంఖ్యలో రైతుల్ని ఎంపికచేసి సాగు వసతులు కల్పిస్తారు.
6.పోడు రైతులు బోర్లు వేసుకుందామంటే అటవీశాఖ అడ్డుకుంటోంది. అనుమతులు పొందినా.. ఆ తర్వాతా నిబంధనల పేరిట అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే సౌర పంపుసెట్లు, బోర్లు వేయిస్తుండటంపై పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
7.పోడు భూములు చిన్న కమతాలైతే.. ఇద్దరు, ముగ్గురు రైతులకు కలిపి ఒక బోరు, సౌరమోటారు ఏర్పాటు చేస్తారు. డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. తొలి మూడేళ్లు వేరుశనగ, పత్తి వంటి పంటలు వేసుకోవచ్చు. ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.
8.ప్రభుత్వం జిల్లాల వారీగా.. వచ్చే ఐదేళ్ల వ్యవధికి లక్ష్యాల్ని ఖరారు చేసింది. మండలాల వారీగా త్వరలో సర్వే చేపడతామని అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల ఐటీడీఏ అధికారులు సర్వేకు సిద్ధమవుతున్నారు.
సంబంధిత కథనం