TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎందుకు ఆలస్యం అవుతోంది? 8 ముఖ్యమైన అంశాలు
TG Indiramma Housing Scheme : క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ.. అధికారుల అలసత్వం కారణంగా ఆశించిన స్థాయిలో సర్వే జరగడం లేదు. ఫలితంగా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. అసలు సర్వే ఎందుకు వేగంగా జరగడం లేదు. ఓసారి చూద్దాం.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా గ్రామాలతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో చాలా నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 31నాటికి లబ్ధిదారుల ఎంపిక సర్వే పూర్తవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ.. సర్వే ప్రారంభమై చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో జరగలేదు. అధికారుల అలసత్వంతో మందకొడిగా నడుస్తోంది.
కారణాలు ఏంటీ..
1.ఒక్కొక్కరు కేవలం 5 నుంచి 10 దరఖాస్తులే పరిశీలిస్తున్నారు. దీంతో గడువు ఇంకా వారం రోజులే ఉందని.. సర్వే ఎలా అని అధికారుల్లో ఆందోళన మొదలైంది.
2.మంగళవారం నుంచి కొత్తగా మెప్మా రిస్సోర్స్ పర్సన్లను కూడా పలు చోట్ల రంగంలోని దించారు. జూనియర్ అసిస్టెంట్లు కూడా సర్వేలో పాల్గొంటున్నారు.
3.వీరందరూ రోజుకు సగటున 8 చొప్పున దరఖాస్తులు పరిశీలించినా.. ఇంకా నెల రోజులు సమయం పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
4.అధికారులు సర్వేకు వెళ్లినప్పుడు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది కూడా సర్వే ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు.
5.స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల జోక్యం కూడా ఎక్కువైందని సర్వే చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు.
6.గ్రామాలు, పట్టణాల్లో.. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దందా నడుస్తోంది. ఇల్లు ఇప్పిస్తామంటూ ఒక్కో లబ్ధిదారుని నుంచి అడ్వాన్సుగా రూ.10 నుంచి రూ.15 వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
7.ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం పంపించిన జాబితా ప్రకారం ఇంటింటికెళ్లి సర్వే చేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.. ప్రజలు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు,
8.క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బందే స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లండని చెప్పడం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది.