Rythu Bandhu : రేపటి నుంచి రైతుబంధు సంబురం.. తొలిరోజు ఈ రైతులకి..-7676 cr to farmers under rythu bandhu scheme from 28 dec ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  7676 Cr To Farmers Under Rythu Bandhu Scheme From 28 Dec

Rythu Bandhu : రేపటి నుంచి రైతుబంధు సంబురం.. తొలిరోజు ఈ రైతులకి..

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 06:31 PM IST

Rythu Bandhu : రాష్ట్రంలో రేపటి నుంచి రైతుబంధు సంబురం మొదలుకానుంది. పదోవిడత పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ విడతలో మొత్తం 70.54 లక్షల మంది రైతులకు రూ. 7,676.61 కోట్లు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

10వ విడత రైతుబంధుకు సర్వం సిద్ధం
10వ విడత రైతుబంధుకు సర్వం సిద్ధం

Rythu Bandhu : Rythu Bandhu: యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 28 నుంచి రైతులకి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2018లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందించింది. పదో విడతకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ విడతలో మొత్తం 70.54 లక్షల మంది రైతులకు రూ. 7,676.61 కోట్లు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు పదో విడతలో రైతు బంధు అందనుంది. తొలి రోజు.. ఎకరం భూమి ఉన్న రైతులకి రైతుబంధు సాయాన్ని జమ చేయనున్నారు. రెండో రోజు రెండెకరాలు ఉన్న రైతులకి నగదు పంపిణీ కానుంది. ఇలా.. సంక్రాంతి లోపు అర్హులైన రైతులందరికీ ఎకరానికి రూ. 5 వేల చొప్పున యాసంగి పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు .. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిధులు సమకూర్చి సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సాగు మొదలైంది. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. శనగ, మినుము, పెసర, కంది, ఉలవ తదితర పప్పుధాన్యాలు.. వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమ తదితర నూనెగింజల సాగు ఊపందుకుంది. తాజాగా.. ప్రభుత్వం రైతు బంధు నిధులని రేపటి నుంచి విడుదల చేయనుండటంతో.. రైతులకి సమయానికి పెట్టుబడి సొమ్ము చేతికందినట్లవుతుంది. ఎరువులు, కూలీల ఖర్చులు, యంత్ర పరికరాల కిరాయి తదితర వ్యయాలకు ప్రభుత్వం అందించే సాయం ఆసరా కానుంది.

రైతుబంధు పదో విడతతో కలిపి... ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా రూ. 65 వేల 559 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. గత వానాకాలం 65 లక్షల మంది రైతులకు రూ.7434.67 కోట్ల నిధులని అందించింది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన మరో 5 లక్షల మంది .. పదో విడతకు అర్హత పొందారు. దీంతో.. లబ్ధిదారుల సంఖ్య 70.54 లక్షలకు చేరింది. రైతు బంధుతో పాటు.. రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే.. రూ. 5 లక్షల బీమా సొమ్ముని 15 రోజుల్లో కుటుంబీకులకి అందిస్తున్నారు.

రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : నిరంజన్ రెడ్డి

అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాకుండా.. శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని... సాగులో రైతుకి అండగా నిలిచి ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే రైతుబంధు కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతుల హక్కు అని పేర్కొన్న ఆయన... దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్ర మోదీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారని ఆరోపించారు. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం... 60 ఏళ్లు నిండిన రైతులకు పింఛను... పంటలకు మద్దతుధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు.... 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. రైతుల విషయంలో పాలకుల దృక్పథం మారాలని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

WhatsApp channel