TGPSC Group1: గ్రూప్ 1 మెయిన్స్‌లో 67.17శాతం హాజరు, ప్రశాంతంగా ముగిసిన మెయిన్స్ పరీక్షలు
TGPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత వారం రోజులుగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైంది. వివిధ క్యాటగిరీల వారీగా పరీక్షలకు హాజరైన వారి వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
TGPSC Group1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పరీక్షలు ఆదివారం 27వ తేదీతో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత పొందారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్‌లో అన్ని పేపర్లకు హాజరైన అభ్యర్థుల వివరాలను రిజర్వేషన్ల వారీగా టీజీపీఎస్సీ వెల్లడించింది.
క్రీడల కేటగిరీలోని అభ్యర్థులు మినహా అన్ని రిజర్వుడు విభాగాల్లోని అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోని పోస్టులకు ప్రధాన పరీక్షల్లో మెరిట్ ఆధారంగా అర్హులు అవుతారని కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మల్టీజోన్-1, 2లోని 5 శాతం అన్ రిజర్వ్‌డ్ పోస్టులకు మొత్తం 2,550 మంది పరీక్షలు రాస్తే.. అందులో తెలంగాణ స్థానికత లేని అభ్యర్థులు 182 మంది ఉన్నారు. దివ్యాంగుల కేటగిరీలో 1.50 నిష్పత్తి ప్రకారం 1,229 మంది అభ్యర్ధులను ఎంపిక చేశామని వివరించింది. ఈ గణాంకాల్లో స్వల్పమార్పులు ఉండే అవకాశముందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
సామాజిక వర్గాల వారీగా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు...
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో రిజర్వేషన్ల పరిధిలో లేని అభ్యర్థులు 3,076మంది అర్హత సాధించగా 2,384మంది పరీక్షలు రాశారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విభాగంలో 2,774మంది అర్హత పొందగా మెయిన్స్ పరీక్షల్ని 1778మంది హాజరయ్యారు.
బీసీ-ఏ విభాగంలో 2,449మంది మెయిన్స్‌కు అర్హత పొందగా 1,648మంది మెయిన్స్ రాశారు. బీసీ బీ విభాగంలో 7560మంది అర్హత పొందితే 4743మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. బీసీ సీలో 664మంది మెయిన్స్ అర్హత సాధించగా 527మంది పరీక్షలకు హాజరయ్యారు. బీసీ డీ విభాగంలో 6324మంది అర్హత పొందగా 3847మంది పరీక్షలు రాశారు.
బీసీ ఈ విభాగంలో 92మంది అర్హత సాధించగా 661మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎస్సీ విభాగంలో 4828మంది మెయిన్స్ అర్హత సాధించగా 3503మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎస్టీల్లో 2783మంది అర్హత పొందగా 1983మంది, క్రీడా విభాగంలో 21మందిలో 19మంది పరీక్షలకు హాజరయ్యారు.