TG Samagra kutumba survey : తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న 6 సమస్యలు
TG Samagra kutumba survey : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదటి దశ ఇవాళ్టితో పూర్తవుతుంది. రేపటి నుంచి రెండో దశ సర్వేను ప్రారంభించనున్నారు. అయితే.. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. నగరాలు, పట్టణాల్లో నెమ్మదిగా సాగుతోంది. గ్రామాల్లో వేగంగా పూర్తవుతోంది. అయితే.. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సర్వే అధికారులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు. అలాగే.. అధికారులు అడిగిన వివరాలు దొరక్క గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి 6 ప్రధాన సమస్యలు ఇలా ఉన్నాయి.
1.సర్వే అధికారులు.. సమగ్ర కుటుంబ వివరాల నమోదుకు ఏ రోజున వస్తారన్న విషయం కచ్చితంగా చెప్పడం లేదు. దీంతో పనుల కోసం బయటకు వెళ్లాల్సిన కుటుంబాలు అయోమయంలో ఉన్నాయి. ఏ రోజు వస్తారో వెల్లడిస్తే.. ఆ రోజు ఇంటి దగ్గర ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రజలు చెబుతున్నారు.
2.చాలా పట్టణాల్లో అద్దెకు ఉంటున్న కుటుంబాల గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది. ఇంటి యజమాని పేరిట స్టిక్కర్ వేస్తామని, అద్దెకు ఉంటున్నవారిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవని సర్వే అధికారులు చెబుతున్నారు.
3.పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటున్న కుటుంబాలు సొంతూరులో వివరాలు నమోదు చేసుకుంటామని సిబ్బందికి చెబుతున్నారు. దీంతో అధికారులు వెళ్లిపోతున్నారు. ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు అని ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. పని సులువుగా అయ్యే అవకాశం ఉంది.
4.కొత్తగా పెళ్లి చేసుకున్న కుమారుడి పేరిట నూతన కుటుంబాన్ని గుర్తించాలని అడిగితే.. స్థానికంగా లేకుంటే నమోదు చేయబోమని సర్వే అధికారులు చెబుతున్నారు. ఒకవేళ గుర్తించి స్టిక్కర్ వేసినా సర్వే సమయంలో తప్పనిసరి స్థానికంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
5.ఎన్యుమరేటర్.. బ్లాకులో కుటుంబాల లిస్టును సిబ్బందికి ఇచ్చారు. చిన్న గ్రామాలు మినహాయిస్తే.. పెద్ద గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో అందులోని కొన్ని ఇంటి నంబర్లు, ఇంటి యజమానుల పేర్లు దొరకడం లేదు. కొన్ని చోట్ల చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్నాయి. ఇది పెద్ద సమస్యగా మారింది.
6.సర్వేలో పాల్గొంటున్న 87 వేల మందిలో సగానికిపైగా సిబ్బంది పాఠశాల విద్య, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు. వీరంతా ఉదయం విధులు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం సర్వేకు వస్తున్నారు. అప్పటివరకు మిగతా సిబ్బంది వీరికోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
స్వల్ప మార్పులు..
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత ప్రకటించిన వాటిలో రెండు ప్రశ్నలను తొలగించి.. కొత్తగా మూడు ప్రశ్నలను చేర్చారు. తుది సర్వే ఫామ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో ప్రకటించిన ఫామ్‌లో పాఠశాలలో చేరిన నాటికి వయసు, వంటకోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం ప్రశ్నల స్థానంలో.. 3 ప్రశ్నలను చేర్చారు. ధరణి పాస్‌పుస్తకం ఎందుకు లేదు.. కారణం ఏంటీ.. కుటుంబంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా?.. ప్రార్థనా మందిరాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారా? అనే ప్రశ్నలు ఉన్నాయి.