TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ-56 candidates will contest in the north telangana mlc elections 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ

TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ

HT Telugu Desk HT Telugu
Published Feb 13, 2025 10:30 PM IST

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలింది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో పట్టభద్రుల స్థానంలో భారీ సంఖ్యలో 56 మంది, టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో నిలిచారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ లో ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో నిలిచిన వారి సంఖ్య తేలింది. పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

బరిలో 32 మంది అభ్యర్థులు…

పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్ దాఖలు చేయక 32 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 56 మంది బరిలో నిలిచారు. పట్టభద్రుల స్థానంలో పది మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగ 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి లట్టు చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి దొడ్ల వెంకటేశం, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి బక్క జడ్సన్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి మంద జ్యోతి, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ నుంచి బొల్లి సుభాష్, నేషనల్ నవ క్రాంతి పార్టీ నుంచి సిలువేరి ఇంద్ర గౌడ్ తో పాటు 46 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు.

టీచర్స్ స్థానంలో 15 మంది పోటీ....

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ల స్థానంలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోటీకి ఆసక్తి చూపుతూ 17 మంది నామినేషన్ దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురికాగ మరొకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బిజేపి అభ్యర్థిగా మల్క కొమురయ్య, బిఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత్ బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పిఆర్టీయు నుంచి మహిపాల్ రెడ్డి, యుటిఎఫ్ నుంచి అశోక్ కుమార్ తోపాటు 15 మంది బరిలో నిలిచారు.

లెక్క తేలింది.. ప్రచారం మిగిలింది.

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. లెక్క తేలడంతో ఇక ప్రచారం ముమ్మరం చేశారు అభ్యర్థులు. ఈనెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు ఇప్పటికే ఎన్నికల కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి నాలుగు జిల్లాలు 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు 3 లక్షల 59 వేల 672 మంది ఉండగా వారంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా టీచర్ ఓటర్లు 28 వేల 714 మంది ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్ట్ లీ గా మారాయి. ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, టీచర్లకు కాసుల పంట పండుతుంది. కరెన్సీ నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఓటు కు ఐదు నుంచి పదివేల ధర పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్రులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఓటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునే బిజీగా ఉన్నారు అభ్యర్థులు. అంతర్గత సమావేశాలు, రహస్యం భేటీలు నిర్వహిస్తూ ఓటుకి ఇంత అని ఒప్పందాలు చేసుకుంటున్నారు. కరెన్సీ నోట్లతో ఓటర్లను కొనుగోలు చేసి మండలిలో అడుగు పెట్టేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తహతహలాడుతున్నారు.‌ ఉద్యోగులు, మేధావులు చదువుకున్న ఓటర్లు మరి తీర్పు ఎలా ఇస్తారోనని సామాన్య ఓటరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం