Hyderabad RGI Airport : పొగ మంచు ఎఫెక్ట్ - శంషాబాద్ విమానాశ్రయంలో 35 విమానాల దారి మళ్లింపు
Hyderabad Shamshabad Airport News: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. పొగ మంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో 35 విమానాలను దారి మళ్లించారు.
Hyderabad Shamshabad Airport: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ విపరీతంగా పడిపోతున్నాయి.చలితో ప్రజలు వణికిపోతున్నారు.చలికి తోడు దట్టమైన పొగ మంచు కారణంగా రహదారులు పై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.పొగ మంచు కారణంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి.ఇటీవలే నల్గొండ జిల్లాలో ఇద్దరు,వికారాబాద్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.ఇటు పొగ మంచు విమాన ప్రయాణానికి కూడా ఆటంకం కలిగిస్తుంది......శంషాబాద్ విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది.దీంతో విమానాలకు రన్వే కనిపించపోవడంతో ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమై సోమవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విమానాలను నిలిపివేశారు.
35 విమానాలు దారి మళ్లింపు......
ఆ సమయంలో 35 జాతీయ, అంతర్జాతీయ విమానాలను అధికారులు దారి మళ్లించారు.ఆ విమానాలను విజయవాడ,బెంగళూరు,ముంబై,నాగ్ పూర్, నగరాలకు మళ్లించారు.ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన గోవా, తిరవనంతపురం,చండీగఢ్ విమానాలను విజయవాడ,గాన్నవారం విమానాశ్రయానికి పంపించారు.పొగ మంచు కమ్ము కోవడం తో ఉదయం 9 గంటల తర్వాత సర్వీసులు ప్రారంభించనున్నట్లు ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఒక ప్రకటన లో వెల్లడించారు. దారి మళ్లించిన విమానాలు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాయి.
సింగిల్ డిజిట్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు......
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు చలికి భయపడుతున్నారు.మరీ ముఖ్యంగా ఏజెన్సీ లపై చలి తీవ్రత పెరిగింది.కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.....అదిలాబాద్ జిల్లాలోని సోనాలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబీలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు,మంచిర్యాల జిల్లాలో 12.2, మహబూబాబాద్ జిల్లాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. పొగ మంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.లైట్స్ ఆన్ చేసినా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితులు ఉన్నాయి.
రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా