మెదక్ జిల్లాలో దారుణం - గిరిజన మహిళపై హత్యాచారం..!-33 years old tribal woman raped and dies in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మెదక్ జిల్లాలో దారుణం - గిరిజన మహిళపై హత్యాచారం..!

మెదక్ జిల్లాలో దారుణం - గిరిజన మహిళపై హత్యాచారం..!

ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. 33 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. చికిత్స పొందుతూ సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గిరిజన మహిళపై హత్యాచారం,,,,? (representative image )

మెదక్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఏడుపాయల ఆలయానికి సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో గిరిజన మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి ఉంచారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి మెదక్‌లోని అడ్డా కూలికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలో కనిపించటంతో…. కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా… సదరు మహిళను ఓ స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం ఉంది. కుడిచేయి విరిగి ఉండగా…. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి.

వెంటనే ఆ మహిళను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాత్రి 7 గంటల వరకు చికిత్స అందిస్తున్నా స్పృహాలోకి రాలేదు. పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా… మొదట అత్యాచారం మరియు హత్యాయత్నం కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. అయితే సదరు మహిళ చనిపోవటంతో అత్యాచారంతో పాటు హత్యగా మార్చబడిందని వెల్లడించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న కోణంలో… సీసీటీవీ ఫుటేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఇక నర్సాపూర్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు మొయినొద్దీన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.ల్యాబ్‌కు శాంపిల్స్‌ పంపగా… రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

 

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం