Telangana Updates: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు గ్రామాలు దేశస్థాయిలో ర్యాంకులు సాధించాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించి సుస్థిర అభివృద్ది సాధించిన గ్రామాలను ఎంపిక చేసింది. తెలంగాణలో 25 గ్రామ పంచాయితీలు ఎంపిక కాక అందులో ఆరు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుస్థిర అభివృద్ది సాధనలో పురోగతి సాధించిన గ్రామ పంచాయితీలు తిమ్మాపూర్, చందుర్తి మండలం బండపల్లి, జమ్మికుంట మండలం గండ్రపల్లి, మల్యాల మండలం బల్వంతపూర్, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట. ఈ ఆరు గ్రామ పంచాయతీలు మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషదాయకమని కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయా పంచాయతీల అభివృద్దిలో కీలకంగా పనిచేసిన నాటి సర్పంచులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఇతర పంచాయతీలు కూడా సుస్థిర అభివృద్ది సాధన కోసం కృషి చేయాలని కోరారు.
గ్రామపంచాయతీల అభివృద్ది, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలు కష్టపడిన మాజీ సర్పంచులపట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపడం సహించరాని విషయమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజల కోసం అప్పులు చేసి, ఆస్తులమ్మి పంచాయతీల్లో అభివృద్ది పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు ఏళ్ల తరబడి పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడం దుర్మార్గమని పేర్గొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సర్పంచులు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం