Karimnagar Water Supply: కరీంనగర్‌లో 24గంటల తాగునీటి సరఫరా..జనవరి 24న ప్రారంభం, ఏర్పాట్లు పరిశీలించిన బండి సంజయ్
Karimnagar Water Supply: కరీంనగర్ ప్రజల కళ నెరవేరబోతుంది. 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయింది.ఈనెల 24న హౌసింగ్ బోర్డ్ కాలనీలో కేంద్ర మంత్రులు 24/7 వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.దశలవారీగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోఅమలు చేస్తారు.
Karimnagar Water Supply: ఎప్పుడెప్పుడా అని కరీంనగర్ ప్రజలు ఎదురు చూస్తున్నా 24/7 వాటర్ సప్లై కి సమయం ఆసన్నమైంది. పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఈనెల 24న హౌసింగ్ బోర్డు కాలనీ లో నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ ను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. 24న వాటర్ సప్లై స్కీమ్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేలా అధికారులకు దిశా నిర్దేశించేశారు. అంబేద్కర్ స్టేడియంలో రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను ప్రారంభిస్తారు. అట్లాగే రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను ప్రారంభిస్తారు.
అనంతరం రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభిస్తారు. పద్మనగర్ లో రూ.14 కోట్లతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ భవనాన్ని ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ క్లాస్ రూమ్ ల ను ప్రారంభిస్తారు. సుభాష్ నగర్ పాఠశాలలో రూ.10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ డిజిటల్ క్లాస్ ను ప్రారంభిస్తారు.
డంపింగ్ యార్డ్ పై కీలక నిర్ణయం...
కరీంనగర్ నగర ప్రజలకు నరకం చూపుతున్న మానేర్ నదీ తీరాన ఉన్న డంపింగ్ యార్డ్ పై కేంద్ర మంత్రులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 365 రోజులు రావణ కాష్టంలా రగులుతున్న డంపింగ్ యార్డును కేంద్ర మంత్రులు సందర్శిస్తారు. డంపింగ్ యార్డ్ తో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుండి నేరుగా హౌజింగ్ బోర్డు కాలనీ విచ్చేసి బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్...
కేంద్ర మంత్రి ఖట్టర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, మార్వాడీ గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్ ప్రాంతాలను సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి ఖట్టర్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..
రాష్ట్రంలో మాజీ సర్పంచులంతా పెండింగ్ బిల్లులు రాక అల్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్దం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆవేదనను అర్ధం చేసుకుని వెంటనే ఆ బిల్లులను చెల్లంచి వేలాది మంది సర్పంచులను ఆదుకోవాలని కోరారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి బెజ్జంకి మండల కేంద్రంలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల 769 మంది తాజా మాజీ సర్పంచులున్నారని, వారికి రావాల్సిన దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
జెండాలను, ఎజెండాలను, బేషజాలను పక్కనపెట్టి అభివృద్దే లక్ష్యంగా పనిచేద్దామని సూచించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు ఏటా 6 వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, యూరియా కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు 30 వేల కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోదీ గారిదేనని తెలిపారు.