Mulugu : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..! ఒకేసారి 22 మంది దళ సభ్యులు లొంగుబాటు-22 maoist party members surrender before mulugu sp shabarish ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..! ఒకేసారి 22 మంది దళ సభ్యులు లొంగుబాటు

Mulugu : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..! ఒకేసారి 22 మంది దళ సభ్యులు లొంగుబాటు

HT Telugu Desk HT Telugu

ములుగు జిల్లా పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 22 మంది లొంగిపోయినట్లు ఎస్పీ శబరీశ్ చెప్పారు. ఇందులో కొందరు కీలకంగా ఉండగా.. మరికొందరు ఇన్ ఫార్మర్లుగా ఉన్నారని వెల్లడించారు.

22 మంది దళ సభ్యులు లొంగుబాటు

ఓ వైపు ఆపరేషన్ కగార్ దడ పుట్టిస్తున్న వేళ.. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్ లో పని చేస్తున్న 22 మంది దళ సభ్యులు ఒకేసారి లొంగిపోయారు. ములుగు ఎస్పీ శబరీశ్ ఎదుట వారు సరెండర్ అయ్యారు. అందులో ఏడుగురు మహిళా సభ్యులు, 15 మంది పురుషులు కాగా.. ఒకేసారి ఇంతమంది పార్టీ వీడి జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టడం స్థానికంగా సంచలనం రేపింది. 22 మంది లొంగుబాటుకు సంబంధించిన వివరాలను ములుగు ఎస్పీ శబరీశ్ శుక్రవారం వెల్లడించారు.

కీలక ఘటనల్లో మాడవి మాస

ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడానికి మాడవి మాస 2010లో మావోయిస్టు పార్టీలో చేరాడు. దళ సభ్యుడిగా చేరిన ఆయన కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో వివిధ ఘటనల్లో పాల్గొన్నాడు. 2013లో ఏసీఎం మెంబర్ గా ప్రమోషన్ పొందాడు. 2017లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెజ్జి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్త చెరువు అంబుష్ వద్ద 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన ఘటనలో మాస పాల్గొన్నాడు. 

ఆ తరువాత అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో బుర్కపాల్ గ్రామం వద్ద రోడ్డు పనుల రక్షణ కోసం వచ్చిన సీఆర్పీఎఫ్ పోలీసులపై కాల్పులు జరపగా.. 25 మంది చనిపోయారు. ఇక 2021 ఏప్రిల్ లో టేకులగుర్మా గ్రామం వద్ద పోలీసులపై మావోయిస్టులు దాడి చేయగా 24 మంది డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు హతమయ్యారు. ఈ ఘటనలన్నింటిలో మాస నిందితుడిగా ఉన్నాడు.

ఏసీఎం టు మిలీషియా చీఫ్..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా మల్లంపేట గ్రామానికి చెందిన ముచ్చకి జోగారాం అలియాస్ జోగా పామేడు ఏరియా కమిటీలో ఏరియా కమిటీ మెంబర్ హోదాలో పని చేశాడు. ప్రస్తుతం కోమటిపల్లి ఆర్‌పీసీ మిలీషియా చీఫ్‌గా పనిచేస్తున్నాడు. 2017 ఏప్రిల్‌లో బుర్కపాల్‌ ఘటన, పామేడు స్టేషన్‌ పరిధి ధర్మారం క్యాంప్‌పై దాడిచేసిన ఘటనలో జోగా కీలకంగా పాల్గొన్నాడు. కాగా ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ బెటాలియన్ కు చెందిన కట్టం దేవా, ముచ్చకి విక్రమ్, మడకం దేవా అనే ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

డిప్యూటీ కమాండర్ జోగా

తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా ఏసీఎం మెంబర్ గా, పువ్వర్తి ఎల్‌వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. ఇతను కూడా బుర్కపాల్‌ దాడితోపాటు 2020లో మిన్‌పా వద్ద జరిగిన దాడిలో 17 మంది పోలీసు సిబ్బందిని హత్య చేసిన ఘటనతో పాటు 2021లో టేకులగూడెం దాడి ఘటనలో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు, 2022లో ఈతగూడెం దాడిలో ఓ పోలీసు మృతి చెందిన ఘటనలో పాల్గొన్నాడు.

మిగతా వాళ్లంతా ఇన్ ఫార్మర్లు

మాడవి మాస, ముచ్చకి జోగారాం, తాటి జోగాతో పాటు మరికొంతమంది దళ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అందులో పూనెం సుక్కు, కొత్తపల్లి రాంపూర్‌ సర్కార్‌ కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, మాడవి హనుమ, వెట్టి వెంకన్న, మాస సోడి, మకడం దేవ, మాడవి జోగా, బీరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్‌, రవన్న, మజ్జి హైమావతి, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల అనే సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ వివరించారు. 

వీరంతా మావోయిస్టులకు సమాచారాన్ని చేరవేయడంతోపాటు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను సమకూర్చేవారని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఆర్‌పీఎఫ్‌–39 బెటాలియన్‌ పీఎంజీ పంచమి లాల్‌, ములుగు డీఎస్పీ రవీందర్‌, వెంకటాపురం, పస్రా సీఐలు కుమార్‌, రవీందర్‌, వెంకటాపురం, కన్నాయిగూడెం ఎస్సైలు తిరుపతి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

HT Telugu Desk