తెలంగాణలో అత్యవసర సేవల కోసం కొత్త నెంబర్ అమల్లోకి వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112కు డయల్ చేయాలని ప్రభుత్వం ప్రకటన చేసింది. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్డ్రన్ వంటి అత్యవసర సేవల కోసం ఈ నెంబర్ ను సంప్రదించాలని సూచించింది. 112కు డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు అందుతాయని పేర్కొంది. ప్యానిక్ బటన్‌ని గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్ వెళ్తుందని తెలిపింది.
దేశవ్యాప్తంగానూ ఇదే అత్యవసర సేవల నంబర్‌గా కొనసాగుతోంది. తాజాగా మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్‌ఎస్‌ఎస్) రూపంలో ఈ సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలపాటు ఈ సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు.