Medak District : మెదక్ పోలీసులు సూపర్… వెళ్లిపోయిన కుమారుడిని గుర్తించారు, తల్లిదండ్రులతో కలిపారు..!-11 years after son reunite him with parents in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak District : మెదక్ పోలీసులు సూపర్… వెళ్లిపోయిన కుమారుడిని గుర్తించారు, తల్లిదండ్రులతో కలిపారు..!

Medak District : మెదక్ పోలీసులు సూపర్… వెళ్లిపోయిన కుమారుడిని గుర్తించారు, తల్లిదండ్రులతో కలిపారు..!

HT Telugu Desk HT Telugu

ఓ యువకుడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే టైమ్ లో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 11 ఏళ్లు దాటినప్పటికీ అతని సమాచారం అందలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు మెదక్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా… అతడిని గుర్తించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అతడిని గుర్తించి.. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

ఫలించిన పోలీసుల కృషి - 11 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు కుమారుడు

తాను ఎందుకు వెళ్ళాడో…. ఏ కారణంతో వెళ్ళాడో తెలియదు. సుమారు 11 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులను వదిలి ఇంటి నుంచి పారిపోయాడు ఓ యువకుడు. మళ్లీ వారిని కలిసేందుకు కూడా రాలేదు. కనీసం తన ఫ్రెండ్స్, బంధువులతో కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆశలు సన్నగిల్లిన కుటుంబ సభ్యులు…. ఈనెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ మొదలు పెట్టిన పోలీసులు… వారం రోజుల్లోనే ఆ యువకుడిని గుర్తించారు. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ కుమారుడు ఇంటికి చేరుకోవటంతో.. ఆ కుటుంబంలో ఎనలేని ఆనందాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగిందంటే…?

ఈ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే… పాపన్నపేట మండలం లో లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన కూనమనేని శ్రీనివాస్ రావు, శారద దంపతులకు తేజ సాయి, బిందు మాధవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో…. తేజ సాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో (సెప్టెంబర్ 4, 2014) ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి ఇంటివైపునకు రాలేదు.

వెతకని చోటు లేదు......

కుమారుడి జాడ కోసం తల్లిదండ్రులు వెతకని చోటు లేదు. ఎలాంటి సమాచారం లేకపోవటంతో వారు ఆశలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఏప్రిల్ 3వ తేదీన పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు.. తేజ సాయి బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల లోపే… పాపన్నపేట పోలీసులు శుక్రవారం రోజు బెంగళూరు వెళ్లారు. తేజ సాయిని కలిసి నచ్చజెప్పారు. శనివారం మెదక్ పట్టణానికి తీసుకొచ్చి… తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు…

11 సంవత్సరాల తర్వాత కొడుకు తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బంధువులు, స్నేహితుల మధ్య స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. తన సొంత కాళ్ళ మీద నిలబడి బతకాలనే కోరికతోనే తేజ సాయి బెంగళూరు వెళ్లాడని పేర్కొన్నారు. సొంతంగా బిజినెస్ ప్రారంభించాడని వెల్లడించారు. అక్కడే ఓ విహహం కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే యువత ఎవరు కూడా ఇలా ఇంటి నుంచి వెళ్లి తల్లిదండ్రులను బాధ పెట్టొద్దని సూచించారు.

ఫిర్యాదు అందిన ఏడు రోజుల్లోనే తేజ సాయిని గుర్తించి అప్పగించిన… డీఎస్పీ ప్రసన్న కుమార్ , ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, వారి బృందాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. టెక్నాలజీ సాయంతో తేజ సాయిని సులువుగా వెతకగలిగారని ఎస్పీ చెప్పారు.

(రిపోర్టింగ్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్ టీ తెలుగు).

HT Telugu Desk