తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. "రాజీవ్ యువ వికాసం" అనే పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం రూ.6,000 కోట్ల బడ్జెట్ ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 17
దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 5
ఎంపిక, ధృవీకరణ: ఏప్రిల్ 6 నుంచి మే 31
తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన: జూన్ 2 (తెలంగాణ నిర్మాణ దినోత్సవం)
1.మొదట అధికారిక పోర్టల్ tgobmms.cgg.gov.in కు వెళ్లాలి.
2.హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రాజీవ్ యువ వికాసం లింక్‌పై క్లిక్ చేయాలి.
3.తదుపరి పేజీలో, రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేయాలి
4.రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. అన్ని ఫీల్డ్‌లను పూరించాలి.
5.ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్ అవుతుంది. వ్యక్తిగత, విద్యా, వృత్తి వివరాలను నమోదు చేయాలి.
6.మొదటి దశలో ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్లు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్టార్‌ను ఎంపిక చేసుకోవాలి.
7.వివరాలు సమర్పించిన తర్వాత గో బటన్‌ను నొక్కాలి.
8.రెండో దశలో క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల వివరాలు ఎంటర్ చేయాలి.
9.డోర్ నంబర్, అడ్రస్ నమోదు చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేసి ప్రివ్యూ చూడాలి. అన్ని సరిగా ఉంటే సబ్‌మిట్ చేయాలి.
10.మ్యాండేటరీ అని ఉన్న అన్ని వివరాలను నమోదు చేయాలి. యూనిట్ కాస్ట్ రూ.4 లక్షలకు మించకూడదు.
11.అన్ని వివరాలను జాగ్రత్తగా సమీక్షించి, ఏప్రిల్ 5 గడువుకు ముందు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా విభజించారు. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తారు. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనున్నారు. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు మంజూరు చేస్తారు.
సంబంధిత కథనం