TG SSC Exams 2025 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - ఆన్ లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ వచ్చేసింది..!-10th class exam fee payment online option available at httpswwwbsetelanganagovin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Exams 2025 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - ఆన్ లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ వచ్చేసింది..!

TG SSC Exams 2025 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - ఆన్ లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ వచ్చేసింది..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 16, 2024 08:32 AM IST

TG SSC Exams Fee 2025 : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు ఆన్ లైన్ లో చెల్లించే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చలానా ఇబ్బందులకు చెక్ పడినట్లు అయింది. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీజును చలానా ద్వారానే చెల్లించాలని పేర్కొనటంతో విద్యార్థులకు, ప్రాధానోపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించేలా… ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనే పరీక్షల ఫీజును చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది.

పరీక్షల ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుం కట్టాలి. ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా కూడా పని భారంగా మారిపోయింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా వెబ్ సైట్ లో ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్ అవుతారు. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెల్లించిన 24 గంటల్లోపు స్టేటస్ అప్డేట్ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తీసుకొచ్చింది.

పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు…

ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు. నిర్దేశించిన గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. నవంబర్‌ 26 వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన అభ్యర్థులకు (జనరల్, వొకేషనల్), హాజరు నుంచి మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులకు, ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూపుల విద్యార్థులకు ఈ ఫీజు గడువు వర్తిస్తుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

  • రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఇంటర్ ఫీజు చెల్లించవచ్చు.
  • ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
  • సెకండియర్‌ జనరల్‌ సైన్స్‌ విద్యార్థులకు రూ.750, సెకండియర్‌ జనరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.520 ఫీజులు నిర్ణయించింది.

Whats_app_banner