రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసినందుకు వారంలో 10,652 కేసులు!-10652 booked in hyderabad for wrong route driving in 1 week ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసినందుకు వారంలో 10,652 కేసులు!

రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసినందుకు వారంలో 10,652 కేసులు!

Anand Sai HT Telugu

హైదరాబాద్ సిటీలో రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ ఎక్కువ మంది చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. భారీగా కేసులు నమోదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ నగరంలో రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 1, 7 మధ్యకాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10,652 మంది వాహనదారులపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒక ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

చాలా మంది వాహనదారులు యూ-టర్న్ దగ్గరకు వెళ్లకుండా.. కాస్త టైమ్ కలిసి వస్తుందని రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారు. అయితే వాహనాలు ప్రయాణించే రూట్‌లో వ్యతిరేకంగ వెళితే ఇతరులకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు.. ప్రమాదాలు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. 'ఇటువంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని ఉపేక్షించేది లేదు. నియమాలు అందరికీ ఉంటాయి, ఉల్లంఘించినవారు కఠినమైన చర్యలను ఎదుర్కొంటారు.' అని ఒక సీనియర్ అధికారి అన్నారు.

హైదరాబాద్‌లో రద్దీగా ఉండే జంక్షన్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బృందాలు ఉన్నాయి. పట్టుబడిన వారికి జరిమానా విధిస్తున్నారు. పదే పదే తప్పు చేసిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజా భద్రత మొదట ముఖ్యం, షార్ట్‌కట్‌ల కోసం రాంగ్‌ రూట్‌లో అనుమతి లేదంటున్నారు. అధికారులు అవగాహన ప్రచారాలను కూడా ప్లాన్ చేస్తున్నారు.

భాగ్యనగరంలో పెరుగుతున్న వాహనాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్‌తో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రజల సహకారంతో పాటు కఠినమైన నియమాల అమలు మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం అని నిపుణులు భావిస్తున్నారు. కేవలం రాంగ్ రూట్ డ్రైవింగ్ చాలా మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది.

రాబోయే వారాల్లో కూడా జరిమానాల అమలు కొనసాగుతుంది. వాహనదారులు క్రమశిక్షణను పాటించాలని, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని పోలీసులు కోరుతున్నారు. బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయడం అంటే జరిమానాలను తప్పించుకోవడమే కాకుండా ప్రాణాలను కాపాడటం కూడా అని పౌరులకు గుర్తు చేస్తున్నారు.

నగర రహదారులను ప్రయాణికులకు సురక్షితంగా మార్చడానికి, రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతున్నారని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు. హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అలవాటుగా మారిందని, ఇది ట్రాఫిక్ రద్దీని కలిగించడమే కాకుండా, ప్రమాదాలకు కారణం అవుతుందని చెప్పారు.

'ట్రాఫిక్ ఉల్లంఘనలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు నివేదించడానికి పౌరులను అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలుపువచ్చు. లేదా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626, ఈ-చలాన్ హెల్ప్‌డెస్క్ 8712661690 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.' అని జోయెల్ డేవిస్ అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.