తెలంగాణలో దీపావళి సందడి నెలకొంది. హైదరాబాద్ నగరం సహా.. ఇతర పట్టణాల్లో బాణసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అబిడ్స్ బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలో అధికారులు సూచనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.
1.టపాసులు విక్రయించే దుకాణాల వద్ద బకెట్లలో ఇసుక, డ్రమ్ముల నిండుగా నీళ్లు ఉంచుకోవాలి.
2.నాణ్యతతో కూడిన తీగలు, విద్యుత్తు సామాగ్రితో వసతులు ఏర్పాటు చేసుకోవాలి.
3.చట్టబద్ధంగా ఆమోదించిన, నాణ్యమైన టపాసులను విక్రయించాలి.
4.పోలీస్, అగ్నిమాపక శాఖ తనిఖీల్లో బాణసంచా అక్రమ నిల్వలను గుర్తిస్తే కఠిన చర్యలుంటాయి.
5.నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య పెద్ద ఎత్తున నిల్వలుంచొద్దు. అలా చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాం.
6.నాణ్యమైన టపాసులు కొనుగోలు చేయడం ఉత్తమం.
7.భవనాలు, వాహనాలు, మండే స్వభావం ఉన్న పదార్థాలకు దూరంగా.. పార్కులు, మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం శ్రేయస్కరం.
8.కాటన్ వస్త్రాలు ధరించాలి. కాల్చిపడేసిన వాటిన ఒక బకెట్‌లో వేయాలి.
9.చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. పేలని టపాసులను మళ్లీ కాల్చేందుకు ప్రయత్నిస్తారు. కళ్లు, చేతులకు గాయాలయ్యే ప్రమాదముంది.
10.తక్షణ సాయానికి..: ఏదైనా ప్రమాదం సంభవించినా, ఇబ్బందులెదురైనా వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పరిధి బొగ్గులకుంటలోని ఓ బాణసంచా దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఎగసిపడ్డాయి. పక్కనున్న హోటల్‌కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి.