Hyderabad to Srisailam : హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్.. 10 ప్రధాన అంశాలు
Hyderabad to Srisailam : హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో దట్టమైన అడవి ఉంటుంది. దీంతో సాయంత్రం 9 గంటల తర్వాత ఈ మార్గంలో వాహనాలను అనుమతించరు. అటు రోడ్డు కూడా ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్- శ్రీశైలం రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలాచోట్ల ప్రమాదకరంగా, ఇరుగ్గా ఉంది. దీంతో.. మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ చేపట్టడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం దాదాపు 150 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
2.ఈ ప్రాజెక్టు అమ్రాబాద్ టైగర్‌రిజర్వు, నల్లమల అటవీప్రాంతం మీదుగా ఉంది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారులు తెలంగాణ ఫారెస్ట్ ఆఫీసర్లతో ఇటీవల సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రాజెక్టు గురించి వివరించారు.
3.హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ మధ్య ట్రాఫిక్, భవిష్యత్తులో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వరుసల నుంచి 4 లేన్లుగా విస్తరించే ప్రణాళికను వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని.. మిగతాచోట సాధారణ రోడ్డును విస్తరిస్తామని స్పష్టం చేశారు.
4.ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో 128.6 కిలోమీటర్ల నుంచి 191 కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
5.తెలంగాణ పరిధిలో మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు జాతీయ రహదారిని విస్తరిస్తారు. ఇక పాతాళగంగ ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో మొత్తం 62.5 కిలోమీటర్లు రహదారిని విస్తరించాలన్నది ప్లాన్. ఇందులో 45.42 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని అచనా.
6.ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమి గురించి అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు ప్రతిపాదించారు.
7.నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఎక్కువ చెట్లు నరకకుండా, అటవీ విధ్వంసం ఎక్కువ జరగకుండా ఉండాలని తెలంగాణ ఫారెస్ట్ అధికారులు షరతులు పెట్టినట్టు సమాచారం.
8.ఈ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు మధ్య రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల్ని అనుమతించడం లేదు.
9.రాత్రివేళలో తిరిగే పులులు, ఇతర వన్యప్రాణులను దృష్టిలోపెట్టుకుని ఈ నిబంధన అమలుచేస్తున్నారు. రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించారు.
10.ఈ ప్రాజెక్టులో ఫ్లైఓవర్ మార్గమధ్యంలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. లైటింగ్ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని.. ఎలివేటెడ్ కారిడార్‌లో రాత్రివేళ తక్కువ లైటింగ్ పెట్టాలని తెలంగాణ అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.