TG New Year Celebrations : కేసులు నమోదైతే తిప్పలు తప్పవు.. పోలీసుల వార్నింగ్.. 10 ముఖ్యమైన అంశాలు
TG New Year Celebrations : కొత్త సంవత్సరం వస్తుంది. ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడానికి యువత సిద్ధం అవుతోంది. అయితే.. వేడుకలు సజావుగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. వేడుకలకు సంబంధించి 10 సూచనలు చేశారు.
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత న్యూ ఇయర్ పేరుతో కేసుల్లో చిక్కుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
10 ముఖ్యాంశాలు..
1.నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు. డీజేలు, మైకుల సౌండ్ పెంచి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు.
2.ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలి. కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయం సమస్యలు వస్తాయి.
3.శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి. ఎలాంటి సమస్యలకు తావివ్వొద్దు. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వేడుకలు నిర్వహించుకోవాలి.
4.31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకన్ ట్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తాం.
5.రాత్రి 12 గంటల వరకు వైన్స్, ఒంటిగంట వరకు బార్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటి నిర్వాహకులు సమయపాలన పాటించాలి. ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకోవాలి.
6.గంజాయి, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు సేవించేవారిపై నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తాం. పట్టుబడితే.. కఠిన చర్యలు ఉంటాయి.
7.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెంట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే.. చర్యలు తప్పవు.
8.మఫ్టీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తారు. యువత గుంపులు గుంపులుగా తిరగొద్దు. ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కేసులు తప్పవు.
9.యువతులు, మహిళలను వేధించేవారిపై చర్యలు తప్పవు. షీ టీమ్స్ నిత్యం నిఘా ఉంచుతాయి. ఎవరైనా వేధింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
10.మైకులు, డీజేలు, ఆర్కెస్ట్రాలు, బాణాసంచా పేల్చడంపై నిషేధం ఉంది. ఎవరైనా నిబంధంనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రజలు సహకరించి ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలి.. అని పోలీసులు సూచించారు.