Kodangal : లగచర్లలో అధికారులపై దాడి ఎలా జరిగింది.. కళ్లకు కట్టినట్టు చెప్పే 10 విషయాలు-10 key facts regarding the attack on officials in lagacharla of kodangal constituency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kodangal : లగచర్లలో అధికారులపై దాడి ఎలా జరిగింది.. కళ్లకు కట్టినట్టు చెప్పే 10 విషయాలు

Kodangal : లగచర్లలో అధికారులపై దాడి ఎలా జరిగింది.. కళ్లకు కట్టినట్టు చెప్పే 10 విషయాలు

Basani Shiva Kumar HT Telugu
Nov 19, 2024 09:44 AM IST

Kodangal : లగచర్లలో అధికారులపై దాడి వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. అటు పరిగి డీఎస్పీపై వేటు పడింది. మరోవైపు పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ కీలక అంశాలను సేకరించారు. వాటిల్లోని 10 కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

కడా ఛైర్మన్‌పై దాడి చేస్తున్న గ్రామస్తులు
కడా ఛైర్మన్‌పై దాడి చేస్తున్న గ్రామస్తులు

లగచర్ల గ్రామలో అధికారులపై దాడి కేసులో 47 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిలో సగం మందికిపైగా అరెస్టు చేశారు. సంగారెడ్డి జైల్లో ఉంచారు. ఈ ఘటనలో కీలక నిందితుడు సురేశ్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు. అయితే.. అసలు ఆ రోజు లగచర్లలో ఏం జరిగిందో కళ్లకట్టినట్టు చెప్పే 10 విషయాలు ఇలా ఉన్నాయి.

1.కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణను తొలుత ఈ నెల 7న జరపాలని నిర్ణయించారు. కొన్ని కారణాలతో 11వ తేదీని ఖరారు చేశారు.

2.ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆందోళన జరిగే అవకాశముందని.. ఇంటెలిజెన్స్‌ అధికారులు జిల్లా పోలీసులను ఒక రోజు ముందే అలర్ట్ చేశారు. ఆందోళన చేసే అవకాశమున్న వారి పేర్లను కూడా ఇచ్చారు. ఆ లిస్టులో కీలక నిందితుడు సురేష్ పేరు కూడా ఉంది.

3.ప్రజాభిప్రాయ సేకరణ జరిగే రోజు లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో 230 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

4.ప్రజలు పోలీస్‌ వాహనాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని భావించి.. వేదికకు దూరంగా వాహనాలను ఉంచారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్, కడా ఛైర్మన్‌ వెంకట్‌ రెడ్డి వేదిక దగ్గరకు వచ్చారు.

5.అప్పుడే వేదిక దగ్గరకు వచ్చిన సురేష్.. రైతులంతా ఊరిలో ఉన్నారని.. అక్కడికి రావాలని కలెక్టర్‌ను కోరారు. ఊరిలోకి వెళ్లేందుకు కలెక్టర్‌ సిద్ధం అయ్యారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశముందని.. వెళ్లొద్దని పోలీసులు కలెక్టర్‌ను కోరారు.

6.రైతులతో మాట్లాడి భూసేకరణకు ఒప్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ తన వాహనంలో ఊర్లోకి వెళ్లిపోయారు. డీఎస్పీలు సహా ఇతర పోలీసులు తమ వాహనాల్లో ఊరిలోకి వెళ్లారు.

7.పోలీసుల కంటే కొద్దిసేపు ముందే కలెక్టర్ గ్రామంలోకి చేరుకున్నారు. పాలనాధికారి కారు దిగిన వెంటనే ఆందోళనకారులు ముందుకు దూసుకొచ్చారు. క్షణాల్లోకి పరిస్థితి అదుపు తప్పింది.

8.వెంటనే అప్రమత్తమైన కలెక్టర్‌ భద్రత సిబ్బంది, మఫ్టీలో ఉన్న పోలీసులు కలెక్టర్‌ను కారులో ఎక్కించి పంపించేశారు. అయితే.. భూసేకరణలో కీలకంగా ఉన్న కడా ఛైర్మన్‌ వెంకట్‌ రెడ్డి గ్రామస్తులకు చిక్కారు. దీంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.

9.అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామస్తుల చేతికి చిక్కి ఉన్న వెంకట్‌ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు.

10.అధికారులపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పరిగి డీఎస్పీపై వేటు వేసింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు సమాచారం.

Whats_app_banner