TG Late Death Certificate : లేట్ డెత్ సర్టిఫికెట్ పొందడం ఎలా.. 10 ముఖ్యమైన అంశాలు
TG Late Death Certificate : ప్రస్తుతం ఏ పని అయినా సర్టిఫికెట్లతోనే అవుతోంది. భూముల రిజిస్ట్రేషన్ మొదలు.. ఏదైనా పథకం రావాలన్నా.. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ధ్రువీకరణ పత్రాలే కీలకం. అయితే.. ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో ఒకటి లేట్ డెత్ సర్టిఫికెట్.
చాలాచోట్ల పెద్దవారు మరణిస్తున్నారు. కానీ.. ఆ సమయంలో వారి డెత్ సర్టిఫికెట్లు తీసుకోవడం లేదు. ఆ తర్వాత చాలా రోజులకు వారి డెత్ సర్టిఫికెట్‌తో పని పడుతోంది. అప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కారణంగా ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నాయి. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ వంటి పనులు ఆలస్యం అవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు ఇప్పుడు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో విలీనం అవుతున్నాయి. దీంతో లేట్ డెత్ సర్టిఫికెట్ తీసుకోవడం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. దీన్ని పొందడానికి సులువైన మార్గం ఇలా ఉంది.
1.గ్రామ పంచాయతీ అయితే.. మొదట నాన్ అవేలబుల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి దీన్ని ఇస్తారు. ఇది మాన్యూవల్‌గా ఉంటుంది.
2.దాన్ని తీసుకొని మండలంలోని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ కంప్యూటర్ సర్టిఫికెట్ ఇస్తారు. దానికి లేట్ రిజిస్ట్రేషన్ డెత్ ఫామ్ జతచేయాలి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో షూరిటీ పెట్టించాలి. (దీన్ని వాంగ్మూలంగా పరిగణిస్తారు.)
3.వాటికి చనిపోయిన వ్యక్తి ఫొటోను జత చేయాలి. దాంతోపాటు దరఖాస్తు చేసేవారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేయాలి. ఆ తర్వాత లాయర్‌తో అఫిడవిట్ చేయించాలి.
4.ఇవన్నీ తీసుకొని మీసేవా కేంద్రానికి వెళ్లాలి. మీసేవలో దరఖాస్తు చేయాలి.
5.మీసేవలో దరఖాస్తు చేసిన తర్వాత అది సంబంధింత డివిజన్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్తుంది. ఆర్డీవో విచారణకు ఆదేశిస్తారు.
6.ఆర్డీవో ఆఫీసు నుంచి ఎమ్మార్వో ఆఫీసుకు వస్తుంది. అప్పుడు డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు.
7.ఎమ్మార్వో ఆఫీసు ఉద్యోగులు విచారణ జరిపి.. రిపోర్టును ఆర్డీవో ఆఫీసుకు పంపుతారు.
8.ఆ రిపోర్టును ఆర్డీవో పరిశీలించి.. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి ప్రొసీడింగ్స్ ఇస్తారు. అప్పుడు మీ సేవా కేంద్రానికి వెళ్లాలి.
9.మీ సేవ కేంద్రం నుంచి లేట్ డెత్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇదంతా జరగడానికి సుమారు నెల రోజుల సమయం పడుతుంది.
10.తొందరగా రావాలంటే.. దగ్గరుండి పని చేయించుకోవాలి. నిత్యం స్టేటస్ తెలుసుకుంటూ.. సంబంధిత అధికారులతో మాట్లాడితే.. పని తొందరగా జరుగుతుంది.