Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక.. మొదట ఎవరికి ఇస్తారు.. 10 ముఖ్యమైన అంశాలు-10 important points regarding the selection of indiramma house beneficiaries in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక.. మొదట ఎవరికి ఇస్తారు.. 10 ముఖ్యమైన అంశాలు

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక.. మొదట ఎవరికి ఇస్తారు.. 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Dec 05, 2024 06:22 PM IST

Indiramma Housing Scheme : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. అలాగే లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందిరమ్మ ఇండ్ల నమూనాతో సీఎం, మంత్రులు
ఇందిరమ్మ ఇండ్ల నమూనాతో సీఎం, మంత్రులు

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే లబ్ధికారుల ఎంపికపై ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గురువారం తెలంగాణ సచివాలయంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇండ్ల లబ్ధికారుల ఎంపికపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

1.ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనా.. అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఇళ్లు అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు.

2.ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని.. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

3.ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌... ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

4.లబ్ధిదారులు తమకున్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా.. ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తామని రేవంత్ వివరించారు. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్‌ను చూపిస్తామని చెప్పారు.

5.మొదట ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని వెల్లడించారు.

6.ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామని చెప్పారు.

7.గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా.. ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

8.పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని.. ఈ పథకం తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. అందుకే ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.

9.ఈ పథకంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించామని సీఎం రేవంత్ చెప్పారు. అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించామని వివరించారు.

10.ఇదొక పండగ సందర్భమని.. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల అని.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండగ చేసుకునే సందర్భమిదని అభిప్రాయపడ్డారు.

Whats_app_banner