Warangal Accident : వరంగల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు-10 important points regarding the road accident occurred at mamunur of warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Accident : వరంగల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు

Warangal Accident : వరంగల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 27, 2025 11:01 AM IST

Warangal Accident : వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి మామునూరు సమీపంలో ఎర్రగా మారింది. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆదివారం మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రమాద స్థలంలో నుజ్జునుజ్జైన ఆటో
ప్రమాద స్థలంలో నుజ్జునుజ్జైన ఆటో

వారంతా ఉపాధి కోసం వలస వచ్చారు. కష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఇనుప స్తంభాల రూపంలో యమపాశం ఎదురైంది. తప్పించుకునే దారి లేకుండా చేసి.. మింగేసింది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురిని బలిగొంది. దీంతో వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం ఉదయం మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

yearly horoscope entry point

10 ముఖ్యమైన అంశాలు..

1.సమయం ఉదయం 11 గంటలు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు ఇనుప స్తంభాల లోడుతో లారీ వస్తుంది. ఐనవోలు మండలం పంథిని గ్రామంలో ఎరువుల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది.

2.సమయం 11 గంటల 32 నిమిషాలు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌.. తనను ఎవరైనా వెంబడిస్తున్నారనే భయంతో లారీని వేగంగా నడిపాడు. ఈ క్రమంలోనే మామునూరు 4వ బెటాలియన్‌ సమీపంలో లారీ అదుపుతప్పి బోల్తాపడింది.

3.సమయం 11 గంటల 35 నిమిషాలు. లారీలోని ఇనుప స్తంభాలు రెండు ఆటోలపై పడ్డాయి. ఓ ఆటోలో ఉన్న వలస కార్మికులు ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. 11 గంటల 40 నిమిషాలకు మామునూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రెయిన్లతో సహాయ చర్యలు చేపట్టారు.

4.సమయం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాలు. పోలీసులు ఇనుప స్తంభాలను తొలగించి, వాటికింద ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

5.సమయం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలు. వరంగల్ కలెక్టర్‌ సత్యశారద, వరంగల్ నగర కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చారు. ఆ తర్వాత బోల్తా పడిన లారీ, ఇనుప స్తంభాలను తొలగించి రోడ్డును క్లియర్‌ చేయించారు.

6.సమయం మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ఘటనా స్థలానికి వచ్చారు. స్థానిక పోలీసులకు సూచనలు చేస్తూ.. రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు.

7.ఈ ఘోర ప్రమాదంలో సంతోష్‌ చౌహాన్‌ అనే వ్యక్తి సహా.. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు మృతి చెందారు. అతని భార్య చామబాయి, మరో కుమారుడు ముకేష్‌ చౌహాన్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు.

8.కొన్ని సెకన్లలోనే.. లారీ బోల్తాపడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సుమారు 20 మీటర్ల మేర రోడ్డుపై రాసుకుంటూ వచ్చిందని అంటున్నారు. దాన్ని గమనించిన ఓ వ్యక్తి కారును వెనక్కి నడిపారు. ఈలోగా లారీలోని ఇనుప స్తంభాలు పక్క నుంచి వెళ్తున్న ఆటోలపై పడ్డాయని స్థానికులు చెప్పారు.

9.రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ యోగేంద్ర మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10.ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వరంగల్‌ కలెక్టర్, ఉన్నతాధికారులను ఆదేశించారు.

Whats_app_banner