చార్మినార్ గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగింది.. 10 ముఖ్యమైన అంశాలు-10 important points regarding the fire accident at charminar gulzar house ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చార్మినార్ గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగింది.. 10 ముఖ్యమైన అంశాలు

చార్మినార్ గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగింది.. 10 ముఖ్యమైన అంశాలు

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మందికి పైగా అగ్నికి ఆహుతయ్యారు. ఇంకా కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ లో తీవ్ర విషాదం జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతలో చెలరేగిన మంటల్లో.. 16 మందికి పైగా మృతి చెందారు. భవనం మెుదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్న పలువురికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సీఎం ఆదేశాలతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.గుల్జార్ హౌస్‌ చౌరస్తాలో ఓ నగల వ్యాపారీ భవనం ఉంది. ఇది జీప్లస్ 2 బిల్డింగ్. దీంట్లోనే నగల వ్యాపారీ, వర్కర్లు 20 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

2.మంటలతోపాటు.. దట్టంగా పొగ అలుముకుంది. దీంతో 16 మంది వరకు స్పృహతప్పి పడిపోయారు. కింద నుంచి పైకి వెళ్లడానికి ఒకే మెట్ల మార్గం ఉంది. అది కూడా ఇరుగ్గా ఉండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

3.ఈ ప్రమాదంలో 16 మంది మృతిచెందినట్టు ఎస్డీఆర్ఎఫ్ అధికారికంగా వెల్లడించింది. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. నలుగురు వృద్ధులు ఉన్నారు. మిగతా నలుగురు 30 నుంచి 40 ఏళ్ల లోపు వారున్నారు.

4.ఎస్టీఆర్ఎఫ్ ప్రకారం మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రహల్లాద్ (70), మున్ని (70), రాజేందర్ మోదీ (65), సుమిత్ర (60), హమి (07), అభిషేక్ (31), షీతల్ (35), ప్రియాంశ్ (04), ఇరాజ్ (02), ఆరుషి (03), రిషబ్ (04), ప్రాతమ్ (1.5), అనుయాన్ (03), వర్ష (35), పంకజ్ (36), రజినీ (32), ఇద్దు (04)

5.మొదటి అంతస్తులో మొత్తం 17 మంది ఉండగా.. వారిని గుర్తించి ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించి.. ఆసుపత్రికి తరలించింది. వారిలో అప్పటికే కొందరు మృతిచెందినట్టు తెలుస్తోంది.

6.విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఏసీ కంప్రెసర్‌ పేలి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు.

7.ఈ అగ్రిప్రమాదంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

8.ఈ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

9.'హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' ఏపీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

10.'హైదరాబాద్​ ఓల్డ్ సిటీలోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 16మందికి పైగా మరణించడం బాధాకరం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశాను. మృతుల్లో చిన్నారులు సైతం ఉండడం దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించాను' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత కథనం