Telangana Ration Shops : సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం..! 10 ముఖ్యమైన అంశాలు
Telangana Ration Shops : రాష్ట్రంలోని పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బియ్యాన్ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయడానికి బియ్యం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
10 ముఖ్యమైన అంశాలు..
1.వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసింది. దీంతో మిల్లింగ్‌పై పౌర సరఫరాల సంస్థ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
2.ధాన్యం సేకరణ నుంచి సన్న, దొడ్లు వడ్లను బస్తాల్లో నింపడం, మిల్లులకు పంపడం, ఆ తర్వాత కస్టమ్ మిల్లింగ్ రైస్ వరకు అధికారులు వేర్వేరుగా చేయిస్తున్నారు.
3.ఈనెల తొలివారం నాటికి 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధమైనట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు.
4.బియ్యం సిద్ధమైన నేపథ్యంలో.. రేషన్ కార్డుదారులకు ఉగాది పండగ రోజు సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది.
5.ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల ఆహారానికి సన్న బియ్యాన్ని వినియోగిస్తున్నారు.
6.రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు, విద్యార్థులకు కలిపి ప్రతి నెలా 2.30 లక్షల టన్నులు సన్న బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
7.ప్రస్తుతం 4.59 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం నిల్వ రెండు నెలలకు సరిపోతాయని పౌర సరఫరాల సంస్థ భావిస్తోంది.
8.ప్రస్తుతం ఉన్న నిల్వలే కాకుండా.. ఇంకా సన్న వడ్ల మిల్లింగ్ జరుగుతోంది. అటు యాసంగి వడ్ల సేకరణ కూడా రెండు నెలల తర్వాత ప్రారంభం అవుతుంది. ఈలోగా వానాకాలంలో సేకరించిన సన్న ధాన్యం సీఎంఆర్‌ను పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
9.వానాకాలం పంటలో 4 లక్షల 48 వేల 939 మంది రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. 100 టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే సుమారు 67 టన్నుల సన్నబియ్యం వస్తాయి.
10.రాష్ట్రంలో 89.98 లక్షల రేషన్ కార్డుల్లో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలా మంది అన్నం వండుకోవడానికి వినియోగించడం లేదు. రీసైక్లింగ్ అవుతున్నాయి. ఈ అక్రమాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.