Vikarabad : సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో అధికారులపై దాడి.. 10 ముఖ్యమైన అంశాలు
Vikarabad : సీఎం సొంత నియోజకవర్గం రణరంగంగా మారింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ కోసం అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగింది. కలెక్టర్ వాహనశ్రేణిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 55 మందిని అరెస్టు చేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన అధికారులపై దాడి ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూ సేకరణ కోసం గ్రామసభకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఎటాక్ జరిగింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అటు సీఎం రేవంత్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెల్ల కిందట దుద్యాల మండల పరిధిలో ఔషధ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ అధికారుల సర్వేలో మొత్తం 1,314.21 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు.
2.హకీంపేట గ్రామంలో పట్టా భూములు 366.34 ఎకరాలు, పోలెపల్లిలో 130.21, లగచర్లలో 156.05 ఎకరాలు కలిపి మొత్తం 676.25 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మిగతా 637.36 ఎకరాలు ఎసైన్డ్ భూములుగా గుర్తించారు.
3..గతనెల 25న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ నేత అవుటి శేఖర్‌పై రోటిబండ తండావాసులు దాడి చేశారు. పోలీసులు ఆయన్ను తప్పించారు.
4తాజాగా .ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ కోసం వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.
5. ఈ గ్రామసభ రణరంగాన్ని తలపించింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
6.కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్ రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది.
7.ఔషధ పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలు సుమారు 200 వరకు ఉన్నాయి. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా భూమికి రూ.10 లక్షల పరిహారం, 120 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, అర్హతను బట్టి పరిశ్రమలో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. తమ భూములు కోల్పోతే భవిష్యత్తు లేదని పలువురు రైతులు ప్రతిపాదనలను వ్యతిరేకించారు.
8.లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కడా అధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ పేర్కొన్నారు.
9.వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో దర్యాప్తు జరుగుతోంది. బోగమోని సురేష్ అనే వ్యక్తి పాత్ర కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా అధికారులను అక్కడికి రప్పించి.. గ్రామస్తులతో దాడి చేయించినట్టు అనుమానిస్తున్నారు. సురేష్‌ను అదుపులోకి తీసుకోనున్న ప్రత్యేక బృందాలు.. అతనికి సహకరించిన గ్రామస్తుల వివరాలను సేకరిస్తున్నారు.
10.అధికారులపై దాడి ఘటనలో ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. దీంతో నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఏడీజీ మహేష్ భగవత్ వికారాబాద్ వెళ్లారు. లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.