ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. జవాన్లూ వీరమరణం పొందుతున్నారు.
1.సరిగ్గా వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకొంది.
2.ఆపరేషన్ కగార్ ప్రారంభమయ్యాక.. గురువారం నాటి రెండు ఎన్‌కౌంటర్లతో కలిపి ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 120కి చేరింది. కేవలం 80 రోజుల వ్యవధిలోనే 120 మంది మరణించారు. ఈ తీవ్రతను పరిశీలిస్తే.. ఆపరేషన్ కగార్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
3.జనవరిలో 48 మంది, ఫిబ్రవరిలో 40 మంది, మార్చి 20వ తేదీన 30 మంది, అంతకుముంద ఇద్దరు.. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల లెక్క ఇది.
4.ఆపరేషన్ కగార్‌లో భాగంగా.. మావోయిస్టుల ఆయువుపట్టుపై సాయుధ బలగాలు గురి చూసి కొడుతున్నాయి. దీంతో మావోయిస్టులు కకావికలమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చుట్టూ బలగాలు ఉండటంతో సాధ్యం కావడం లేదు.
5.రెండున్నర దశాబ్దాల కిందట దాదాపు 14 రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి కనిపించేది. కానీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాలో మాత్రమే కీలకంగా ఉన్నారు. తెలంగాణ, ఒడిశా విషయం ఎలా ఉన్నా.. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ మకాం వేసినట్లు కచ్చితమైన సమాచారం ఉండడంతో భద్రత బలగాలు అటువైపు దూసుకెళ్తున్నాయి.
6.ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 2019 నుంచి ఇప్పటివరకు దాదాపు 250 సీఆర్పీఎఫ్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి అడవుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
7.ఈ ఆపరేషన్ కగార్ ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొనసాగుతోంది. భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.
8.మావోయిస్టుల శిబిరాలపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉన్నాయి.
9.ఆపరేషన్ కగార్ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అవసరమని వాదిస్తుంటే.. మరికొందరు ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని విమర్శిస్తున్నారు.
10.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు.
సంబంధిత కథనం