Zim vs Sco: స్కాట్లాండ్‌ను చిత్తు చేసి సూపర్ 12లోకి జింబాబ్వే
Zim vs Sco: స్కాట్లాండ్‌ను చిత్తు చేసి సూపర్ 12లోకి దూసుకెళ్లింది జింబాబ్వే టీమ్. శుక్రవారం (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Zim vs Sco: టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12 స్టేజ్‌లోని అన్ని జట్లూ ఖరారయ్యాయి. శుక్రవారం జరిగిన తొలి రౌండ్ చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే.. సూపర్ 12కు వెళ్లగా, స్కాట్లాండ్ ఇంటిదారి పట్టింది. హోబర్ట్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్లతో విజయం సాధించింది. గ్రూప్ బిలో టాపర్‌గా నిలిచిన జింబాబ్వే.. సూపర్ 12లో గ్రూప్ 2లో ఉన్న ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ టీమ్‌తో చేరింది.
చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ విసిరిన 133 పరుగుల టార్గెట్‌ను జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 54 బాల్స్‌లో 58 రన్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సికిందర్ రజా కూడా 23 బాల్స్‌లో 40 రన్స్ చేయడం విశేషం. మిగతా బ్యాటర్లు విఫలమైనా ఈ ఇద్దరూ జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 రన్స్ చేసింది. ఓపెనర్ జార్జ్ మన్సీ 51 బాల్స్‌లో 54 రన్స్ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చటారా, ఎన్‌గరవా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ బి నుంచి శుక్రవారం ఉదయం ఐర్లాండ్ కూడా సూపర్ 12కు చేరిన విషయం తెలిసిందే. ఆ టీమ్ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించడం విశేషం.
ఐర్లాండ్ సూపర్ 12 గ్రూప్ 1లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంకలతో చేరింది. శనివారం (అక్టోబర్ 22) నుంచి టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇక ఈ మ్యాచ్ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి. ఈసారి 8 టీమ్స్ నేరుగా సూపర్ 12కు అర్హత సాధించగా.. మరో నాలుగు స్థానాల కోసం 8 టీమ్స్ తలపడ్డాయి. గ్రూప్ ఎ, గ్రూప్ బిలుగా విడిపోయిన టీమ్స్ ఆరు రోజుల పాటు ఫైట్ చేశాయి. చివరికి రెండు గ్రూపుల నుంచి నాలుగు టీమ్స్ శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే సూపర్ 12కు చేరాయి.
టాపిక్