Turning Point In 3rd ODI: అతడి వికెటే మూడో వన్డేలో టర్నింగ్ పాయింట్.. జహీర్ ఖాన్ స్పష్టం-zaheer khan says kl rahul wicket is turning point in 3rd odi ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Zaheer Khan Says Kl Rahul Wicket Is Turning Point In 3rd Odi

Turning Point In 3rd ODI: అతడి వికెటే మూడో వన్డేలో టర్నింగ్ పాయింట్.. జహీర్ ఖాన్ స్పష్టం

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (AFP)

Turning Point In 3rd ODI: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ కేఎల్ రాహుల్ వికెట్ పడటమేనని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

Turning Point In 3rd ODI: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో ఆసీస్ సిరీస్ 1-2 తేడాతో సొంతం చేసుకుంది. 270 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభం అదిరినా.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోతూ చేజేతులా మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఈ ఓటమితో భారత ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ మ్యాచ్‌పై భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ స్పందించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడమే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని అతడు స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"ఈ లక్ష్య ఛేదనలో భారత్ చాలా వరకు మ్యాచ్‌ను తన కంట్రోల్‌లోనే ఉంచుకుంది. కానీ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ వెంటనే అక్షర్ పటేల్ రనౌట్ కావడం చక చకా జరిగిపోయాయి. అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య మ్యాచ్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇది కోహ్లీపై ఒత్తిడి పెంచింది. అతడు మళ్లీ గేర్ మార్చి ధాటిగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. చెన్నై లాంటి పిచ్‌పై ఓ వికెట్.. రెండింటిని తీసుకురాగలదు. అది నిజంగా ఒత్తిడిని పెంచుతుంది." అని జహీర్ ఖాన్ తెలిపాడు.

అప్పటికప్పుడు ఆటలో గేర్ మార్చే కంటే గేమ్‌ను మరింత తలోతుగా తీసుకెళ్లాలని జహీర్ అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో గేమ్‌లో వీలైనంత లోతుగా వెళ్లాలి. ఇక్కడ అది మిస్ అయింది. కొంత ఆందోళన నెలకొంది. చాలా త్వరగానే ఆటలో వేగం పెంచారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ముందు అతడు పెద్ద షాట్లు ఆడటం ప్రారంభించాడు. ఇక్కడ చూస్తే బలవంతంగా ఆడినట్లు తెలుస్తుంది" అని జహీర్ అన్నాడు.

కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్‌లో లాంగ్ ఆన్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి తర్వాత వెంట వెంటనే టీమిండియా వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (54) అర్ధశతకంతో ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 4 వికెట్లతో రాణించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.