ప్రస్తుతం భారత క్రికెట్లో ట్రెండింగ్‌లో ఉన్న పేరు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiwal). ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైన జైస్వాల్ అరంగేట్రం మ్యాచ్ లోనే రెచ్చిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ(Yashasvi Jaiswal Century) సాధించాడు. దీంతో భారత జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. జైస్వాల్ నడిచిన బాట చాలా మందికి తెలుసు. కష్టపడి పైకి వచ్చాడు. అతడు విజయాలు సాధించగానే.. ప్రతిసారీ పానీపూరీ అమ్ముకుని బతికే వ్యక్తి.. ఇండియన్ క్రికెటర్ అయ్యాడని వార్తలు వస్తుంటాయి. కానీ, ఇది ఫేక్ న్యూస్ అట.
జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ.. పానీపూరి ఇప్పుడు మరీ పెరిగి పెద్దదైందని చెప్పారు. రిపబ్లిక్ వరల్డ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో జ్వాలా మాట్లాడుతూ.. దీనిపై పూర్తి సమాచారం ఇచ్చారు. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేయమని కొంతమంది మీడియా ప్రతినిధులను తాను చాలాసార్లు అభ్యర్థించానని కోచ్ చెప్పారు. కానీ అతను చాలా సార్లు తిరస్కరించినట్టుగా తెలిపారు. ఒకరోజు జైస్వాల్ ఇంటర్వ్యూ అడుగుతున్నారని తనకు ఫోన్ చేసి చెప్పగా.. సరే ఇవ్వమని చెప్పానని తెలిపారు జ్వాలా సింగ్.
ఈ ఇంటర్వ్యూలో జైస్వాల్‌ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడని జ్వాలా వెల్లడించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్నవారు పానీపూరీ థీమ్‌ను హెడ్‌లైన్స్‌గా చేసుకుని పెద్ద వార్తలను చేశారని జ్వాలా సింగ్ అన్నారు. జైస్వాల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్ వద్ద ఒక వ్యక్తితో నిలబడి ఉన్న ఫోటో కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలో ఉన్నది తన తండ్రి కాదని, ఇది కేవలం సాధారణ చిత్రమేనని కోచ్ జ్వాలా చెబుతున్నారు. జీవనోపాధి కోసం జైస్వాల్ కుటుంబం పానీపూరి అమ్మలేదని తెలిపారు.
2013లో తన దగ్గర క్రికెట్ కోచింగ్ ప్రారంభించినప్పుడు జైస్వాల్ కుటుంబం పానీపూరీలు అమ్మలేదని జ్వాలా సింగ్ చెబుతున్నారు. మొదట ముంబైకి వచ్చి ఒక డేరాలో నివసించినప్పుడు, కొన్ని రోజులకు విక్రయించబడి ఉండవచ్చు. కానీ అప్పుడు యశస్వి చాలా చిన్నవాడు అని వెల్లడించారు కోచ్. వారికి కనీస సౌకర్యాలు లేవు, కరెంటు లేదు, సరైన ఆహారం లేదు, వర్షాకాలంలో వారి గుడారం నీటితో నిండిపోయిందని పేర్కొన్నారు.
గత 10 సంవత్సరాలుగా యశస్వినిని చూస్తున్నానని, U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్ముడవుతున్నట్టుగా రాసిన కథనాలు తనకు సహాయం చేసిన వ్యక్తుల సహకారాన్ని కించపరుస్తాయని జ్వాలా సింగ్ భావించారు. 'జైస్వాల్ మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు, అతని తల్లిదండ్రులు ప్రతి నెలా రూ. 1000 చెల్లించేవారు. అతని తండ్రికి పెయింట్ షాప్ ఉంది. సరైన కోచింగ్ వల్లే జైస్వాల్ ఈరోజు క్రికెట్ ఆడుతున్నాడు. వారికి ఆహారం, నివాసం, అన్నీ సమకూర్చి నా చేతనైనంత సాయం చేశాను. నా జీవితంలో 9 విలువైన సంవత్సరాలు జైస్వాల్‌కి ఇచ్చాను' అని జ్వాలా సింగ్ వెల్లడించారు.