WPL Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL).. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ లీగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గుడ్ న్యూస్ చెప్పారు.,ఈ డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి 26 వరకూ ముంబైలో జరగనున్నట్లు పీటీఐతో ఆయన వెల్లడించారు. ముంబైలోని బ్రబౌన్స్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలలో ఈ లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ కు చెందిన టీమ్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.,ఇక ముంబైలోనే ప్లేయర్స్ వేలం జరగనున్నట్లు కూడా ధుమాల్ స్పష్టం చేశారు. ఈ వేలం ఫిబ్రవరి 13న జరగనుంది. వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 12న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుండగా.. మరుసటి రోజే వేలం జరుగుతుంది. ఐదు ఫ్రాంఛైజీల అమ్మకం ద్వారా రూ.4670 కోట్లు, మీడియా హక్కుల వేలం ద్వారా రూ.951 కోట్లు బీసీసీఐకి వచ్చిన విషయం తెలిసిందే.,ఈ రెండింటి ద్వారా ప్రపంచంలో ఐపీఎల్ తర్వాత రెండో అతిపెద్ద టీ20 లీగ్ గా డబ్ల్యూపీఎల్ నిలిచింది. ప్లేయర్స్ వేలం కోసం సుమారు 1500 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా.. ఫైనల్ లిస్ట్ ఈ వారం చివర్లోపు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో టీమ్ కు ప్లేయర్స్ కొనుగోలు కోసం రూ.12 కోట్ల పరిమితి విధించారు. ఒక్కో టీమ్ కనీసం 15 మంది, గరిష్ఠంగా 18 మందిని కొనుగోలు చేయొచ్చు.,డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 22 మ్యాచ్ లు ఉంటాయి. లీగ్ స్టేజ్ లో టాప్ ర్యాంక్ లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడతాయి.,