Jannik Sinner Doping: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్.. తప్పని డోపింగ్ వేటు.. జనవరిలో టైటిల్.. ఫిబ్రవరిలో బ్యాన్
Jannik Sinner Doping: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినర్ పై డోపింగ్ వేటు తప్పలేదు. ఇన్ని రోజులూ తప్పించుకుంటూ వచ్చిన ఈ ఇటలీ ఆటగాడు 3 నెలల డోపింగ్ నిషేధాన్ని అంగీకరించాడు. సినర్ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు.

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినర్ పై మూడు నెలల నిషేధం పడింది. 2024లో రెండు సార్లు డోపింగ్ పరీక్షలో సినర్ పాజిటివ్ గా తేలాడు. కానీ మొదట తాను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని బ్యాన్ విధించకుండా వదిలేశారు. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
మూడు నెలలు ఔట్
ఇటలీ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ డోపింగ్ బ్యాన్ ఫిబ్రవరి 9 నుంచి మే 4 వరకు కొనసాగుతోంది. ‘‘దాదాపు ఏడాదిగా ఈ కేసు నా మీద వేలాడుతూనే ఉంది. ప్రాసెస్ చాలా కాలం సాగుతుంది. నా టీమ్ చేసిన దానికి నేనే బాధ్యుణ్ని. అందుకే 3 నెలల నిషేధం విధిస్తూ ప్రపంచ డోపింగ్ నిరోధకం సంస్థ (వాడా) ఇచ్చిన ఆఫర్ ను అంగీకరించా’’ అని సినర్ పేర్కొన్నాడు.
అసలు ఏమైందంటే?
గతేడాది ఆరంభంలో సినర్ ఫిజియోథెరపిస్ట్ వేలు కట్ అయింది. దానికి అతను క్లోస్టెబాల్ ఉన్న స్ప్రే వాడాడు. ఆ చేతితోనే సినర్ కు మసాజ్ చేశాడు. సినర్ కు మార్చిలో డోపింగ్ టెస్టు చేయగా నిషేధిత ఉత్ప్రేరకం క్లోస్టెబాల్ వాడినట్లు తేలింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదని సినర్ వివరణ ఇవ్వడంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ అతణ్ని వదిలేసింది.
వాడా అప్పీల్
టెన్నిస్ లో రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలంటూ ఇతర టెన్నిస్ ప్లేయర్లు సినర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. మరోవైపు వాడా కూడా సినర్ పై నిషేధం కోసం ఇంటర్నేషనల్ క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. ఇప్పుడు సినర్ బ్యాన్ కు ఒప్పుకోవడంతో వివాదం ముగిసింది. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సినర్.. ఫ్రెంచ్ ఓపెన్ వరకూ నిషేధం నుంచి బయటపడతాడు.
సంబంధిత కథనం