Ashes Series: “ఆ విషయంలో తగ్గేదే లేదు”: ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‍కలమ్
Ashes Series: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో తమ జట్టు ప్రదర్శించే వైఖరి గురించి ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‍కలమ్ మాట్లాడాడు. తమ స్టైల్‍లోనే ఆడతామని స్పష్టం చేశాడు. మరిన్ని విషయాలను వెల్లడించాడు.
Ashes Series: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఆతిథ్య ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న సందర్భంలో తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం కాగా.. ఓటమికి అది కూడా ఓ కారణమేనని జట్టుపై విమర్శలు వస్తున్నాయి. దూకుడు ఉండాలే కానీ.. మరీ ఎక్కువైతే కష్టమనే కామెంట్లు వస్తున్నాయి. తదుపరి లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 28న యాషెస్ సిరీస్‍లో రెండో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, ఇంగ్లండ్ జట్టు ప్రస్తుత హెడ్‍కోచ్ బ్రెండెన్ మెక్‍కలమ్ కీలక విషయాలు మాట్లాడాడు. లార్డ్స్ టెస్టులో అనుసరించే విధానాన్ని వెల్లడించాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
లార్ట్స్ టెస్టులో మరింత దూకుడైన వ్యూహాన్ని పాటిస్తామని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‍కలమ్ చెప్పాడు. దూకుడు విషయంలో ఏం మాత్రం తగ్గబోమని తేల్చేశాడు. కొంతకాలంగా టెస్టు క్రికెట్‍లోనూ అగ్రెసివ్‍గా ఆడుతోంది ఇంగ్లండ్. దీనికి బజ్‍బాల్ క్రికెట్ అని పేరుపెట్టుకుంది. యాషెస్ సిరీస్‍లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇలాగే దూకుడుగా ఆడింది. అయితే, ఆస్ట్రేలియా గెలిచింది. ఈ విషయంపైనా మెక్‍కలమ్ స్పందించాడు.
“మేం మా స్టైల్‍లో ఆడాం. మ్యాచ్‍ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. ఆస్ట్రేలియా ప్లేయర్లు వారి స్టైల్‍లో ఆడారు, అయితే వారు గెలిచారు. వారు అదే స్టైల్‍ను కొనసాగిస్తారని అనుకుంటున్నాం. మేం మాత్రం మరింత ఎక్కువ హార్డ్‌గా ముందుసాగుతాం. ఈ సిరీస్‍లో చాలా రసవత్తర పోరు ఉంటుందనిపిస్తోంది” అని మెక్‍కలమ్ చెప్పాడు.
తొలి టెస్టు తమ జట్టు ఆడిన తీరు సంతృప్తికరంగానే అనిపించిందని బ్రెండన్ మెక్‍కలమ్ చెప్పాడు. అయితే, అదృష్టం కలిసిరాలేదని అభిప్రాయపడ్డాడు. “నిస్సందేహంగా గెలుపొందాలనే అనుకుంటాం. మేం మా స్టైల్‍లోనే ఆడాం. ఒకవేళ కాస్త అదృష్టం కలిసి వచ్చి ఉంటే మేం గెలుపు వైపున ఉండేవాళ్లమేమో” అని మెక్‍కలమ్ చెప్పాడు.
యాషెస్ తొలి టెస్టు చివరి రోజు ఇంగ్లండ్ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44 నాటౌట్) చివర్లో వీరోచిత పోరాటం చేశాడు. నాథన్ లయాన్ (16 నాటౌట్)తో కలిసి 9వ వికెట్‍కు అజేయంగా 55 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను కొన్నింటిని ఇంగ్లండ్ చేజార్చుకుంది. మొత్తంగా రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో గెలిచింది ఆసీస్.