Sehwag About Team Selection: టీమ్ సెలక్షన్‌పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని స్పష్టం-virendra sehwag says youngsters not getting chances in world cup events ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virendra Sehwag Says Youngsters Not Getting Chances In World Cup Events

Sehwag About Team Selection: టీమ్ సెలక్షన్‌పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Nov 11, 2022 08:03 PM IST

Sehwag About Team Selection: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. టీమ్ సెలక్షన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు తీసుకున్నట్లు వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లలో కుర్రాళ్లకు కూడా అవకాశమివ్వాలని స్పష్టం చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ (AFP)

Sehwag About Team Selection: టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా అనూహ్య ఓటమితో భారత అభిమానులు తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యారు. ఫలితంగా సర్వత్రా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పలువురు మాజీలు కూడా జట్టు కూర్పుపై, టీమ్‌లో యువ ఆటగాళ్లు లేకపోవడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తీసుకుంటున్న యువ ఆటగాళ్లను.. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఎందుకు అవకాశమివ్వడం లేదని ప్రశ్నించాడు.

ట్రెండింగ్ వార్తలు

"స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లను సులభంగా గెలుస్తున్నాం. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు ఎంతమంది ఆడుతున్నారో చూడాలి. వారు సాధారణంగా ఇలాంటప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొత్త ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలను సాధిస్తున్నారు. కాబట్టి వారి ఇక్కడ తీసుకున్నట్లే.. వరల్డ్ కప్‌లోనూ ఎందుకు ప్రయత్నించకూడదు. నిర్భయంగా ఆడే యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, పృథ్వీ షా లాంటి అంతర్జాతీయ ప్లేయర్లు. బాగా పరుగులు చేస్తున్నారు." అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

"త్వరలో జరగనున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి లభించిన కారణంగా కుర్రాళ్లకు అవకాశం లభించింది. న్యూజిలాండ్‌లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్లు గెలిస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది? అందుకే సీనియర్లపై ఒత్తిడి ఉండాలి. యంగ్ ఆటగాళ్లు తాము కూడా స్కోర్లు చేయగలమని చెప్పాలి. సీనియర్లు రాణించకపోతే.. బోర్డు వారిని పక్కనపెట్టవచ్చు." అని సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గత 11 నెలల్లో టీమిండియా 9 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను ఆడింది. ఇందులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి అగ్ర జట్లతో తలపడింది. దాదాపు విజయాలను అందుకుంది. కానీ అనూహ్యంగా ఆసియా కప్‌లో ఓడిపోవడమే కాకుండా.. తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లో ఇంటిముఖం పట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఓపెనర్లే మ్యాచ్‌ను గెలిపించారు. జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరూ చెరో అర్ధశతకంతో దుమ్మురేపి ఇంగ్లీష్ జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించారు. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం