Virat kohli on captaincy: టెస్ట్ కెప్టెన్సీ వదిలిపెట్టినప్పుడు ధోనీ మాత్రమే మెసేజ్ చేశాడు - కోహ్లి కామెంట్స్ వైరల్
Virat Kohli:ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధోనీని ఉధ్దేశించి విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Virat Kohli: గత రెండేళ్లుగా విరాట్ కోహ్లి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మూడు ఫార్మెట్లలో వరుసగా విఫలమవుతుండటంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. కోహ్లిపై ఘాటైన వ్యాఖ్యలతో పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు కనిపించారు. ఈ విమర్శలపై ఇన్నాళ్లు సెలైంట్ గా ఉన్న కోహ్లి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ మాత్రమే తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కోహ్లి హాజరుకావడం ఆసక్తిని రేకెత్తించింది.
చాలా రోజుల తర్వాత అతడు మీడియా ముందుకు రావడంతో అతడు ఏం చెబుతాడోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. టెస్ట్ కెప్టెన్సీ ని వదిలిపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలపై కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత కేవలం ధోనీ మాత్రమే తనకు పర్సనల్ గా మెసేజ్ పెట్టాడని కోహ్లి పేర్కొన్నాడు. తన ఫోన్ నంబర్ చాలా మంది దగ్గర ఉందని, కానీ ఎవరూ తనకు ఫోన్, మెసేజ్ చేయలేదని తెలిపాడు. ధోనీ సారథ్యంలో ఆడిన సమయంలో తానెప్పుడూ ఇన్ సెక్యూర్ గా ఫీలవ్వలేదని, తన విషయంలో ధోనీ అదే భావనతో ఉన్నాడని చెప్పాడు. ఆటగాళ్ల మధ్య ఆ బంధం ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.
టీవీలు, సోషల్ మీడియాల ద్వారా చాలా మంది తనకు సలహాలు ఇచ్చారని అన్నాడు. దూరంగా ఉంటూ చెప్పిన మాటలకు ఎప్పుడూ విలువ ఉండదని కోహ్లి పేర్కొన్నాడు. ఎవరికైనా ఓ మంచి విషయాన్ని చెపాల్సివస్తే అతడిని నేరుకు కలిసే తాను వివరిస్తానని, అంతేకానీ టీవీలు, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ సలహాలు ఇవ్వనని అన్నాడు. తన విషయంలో చాలా మంది సలహాలు ఇచ్చారని, కానీ అందులో ఒక్కరూ కూడా తనను నేరుగా కలిసి ఆ మాటలు చెప్పలేకపోయారని పేర్కొన్నాడు. కోహ్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 44 బాల్స్ లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో కోహ్లి 60 రన్స్ చేశాడు.