Telugu News  /  Sports  /  Virat Kohli Hits Maiden T20 Century Against Afghanistan In Asia Cup Match
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

Virat Kohli Maiden T20 Hundred: పొట్టి ఫార్మాట్‌లో విరాట్ అరుదైన ఘనత.. ఏంటో తెలుసా?

08 September 2022, 21:40 ISTMaragani Govardhan
08 September 2022, 21:40 IST

Virat Kohli Maiden T20 Century: విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో తన మొదటి శతకాన్ని నమోదు చేశాడు. ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో అదిరిపోయే శతకం చేశాడు.

Virat Kohli Maiden T20 Hundred: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రెండున్నరేళ్లు దాటింది. రోజుల్లో చెప్పాలంటే కచ్చితంగా 1020 రోజులైంది. అతడు ఎప్పుడెప్పుడు శతకం చేస్తాడా అని సగటు అభిమాని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. విరాట్ పెను విధ్వంసమే సృష్టించాడు. పసికూన అనే బిరుదును తనకు ఆపాదించడం ప్రమాదమే అంటూ సత్తా చాటుతున్న ఆఫ్గానిస్థాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇంతవరకు సెంచరీ చేయని కోహ్లీ.. అదిరిపోయే విధంగా సత్తా చాటాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులతో అదరగొట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తంగా 71వ అంతర్జాతీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో నిలిచి రికీ పాంటింగ్‌ను సమం చేశాడు. 1020 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ సాధించాడు. చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ శతకం సాధించిన విరాట్.. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీ చేశాడు. 84 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత కోహ్లీ శతకం సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్లు..

సచిన్ తెందూల్కర్- 100(660 మ్యాచ్‌ల్లో)

రికీ పాంటింగ్- 71(560 మ్యాచ్‌లు)

విరాట్ కోహ్లీ- 71(468 మ్యాచ్‌లు)

టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ దిగాడు కోహ్లీ. వీరిద్దరూ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రాహుల్ అర్ధశతకం చేయగా.. కోహ్లీ శతకంతో విజృంభించాడు. విరాట్ మొత్తంగా 61 బంతుల్లో 122 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో కోహ్లీకిదే తొలి శతకం కావడం గమనార్హం. అంతేకాకుండా టీ20ల్లో సెంచరీ చేసిన అతిపెద్ద భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ 33 ఏళ్ల 307 రోజుల వయస్సులో శతకం చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 31 సంవత్సరాల 299 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ 31 సంవత్సరాల 190 రోజుల వయస్సులో శతక్కొట్టాడు.