Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు బాక్సర్ మేరీ కోమ్ పంచ్.. అది మనమే చూసుకోవాలంటూ..
Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ వివాదంపై బాక్సర్ మేరీ కోమ్ స్పందించింది. పరోక్షంగా రెజ్లర్ కు పంచ్ వేస్తూ వెయిట్ మేనేజ్‌మెంట్ ఎవరిది వాళ్లే చూసుకోవాలని ఆమె అనడం గమనార్హం.
Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురవడం కోట్లాది మంది అభిమానులను షాక్ కు గురి చేసింది. కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఫైనల్లో తలపడకుండా ఆమెపై అనర్హత వేటు వేశారు. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన మరో ఒలింపియిన్, బాక్సర్ మేరీ కోమ్ తప్పంతా వినేశ్ దే అన్నట్లుగా మాట్లాడింది.
అది మనమే చూసుకోవాలి: మేరీ కోమ్
ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ అయిన బాక్సర్ మేరీ కోమ్ ఈ వివాదంలో వేరే వాళ్లను నిందించడం సరి కాదని, బరువు చూసుకోవాల్సిన బాధ్యత సదరు అథ్లెట్ చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వివాదంపై ఆమె తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.
"ఈ విషయంలో నేను ఎంతో నిరాశ చెందాను. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నేను కూడా ఈ వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాను. బరువు అనేది చాలా ముఖ్యం. అది నా బాధ్యత. ఈ విషయంలో మరొకరిని నేను నిందించను.
ఆమె విషయం ఇది నేను చెప్పడం లేదు. నా విషయంలో మాత్రమే చెబుతున్నాను. ఒకవేళ నేను నా బరువును నియంత్రణలో ఉంచుకోలేకపోతే నేనెలా ఆడగలను? మెడల్ గెలవాలన్నదే నా లక్ష్యం. నేను ఆ విషయం గురించే ఆలోచిస్తాను" అని మేరీ కోమ్ తేల్చి చెప్పింది.
వినేశ్ వివాదం ఇదీ
ఈ ఏడాది జరిగి పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఇండియాకు కనీసం సిల్వర్ మెడల్ పక్కా అనుకున్న సమయంలో అనూహ్యంగా వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను ఫైనల్ ఆడకుండా చేశారు.
దీనిపై వినేశ్ సీఏఎస్ ను కూడా ఆశ్రయించింది. కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇప్పించాలని కోరింది. కానీ దీనికి సీఏఎస్ అంగీకరించలేదు. బరువు విషయంలో పక్కాగా నిబంధనలు ఆమెకు తెలుసని, దీనిపై ఆమెకేమీ వెసులుబాటు కల్పించే వీలుండదని స్పష్టం చేసింది. దీంతో వినేశ్ మెడల్ ఆశలు కల్లలైపోయాయి.
వినేశ్ తన ఒలింపిక్స్ మెడల్ ఆశ తీరకుండానే రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేసింది. ఆమె గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ లో రెండు బ్రాంజ్ మెడల్స్, మూడు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్స్ గెలిచినా ఒలింపిక్స్ లో మాత్రం ఆ ఆశ నెరవేరలేదు. ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.