Vinesh Phogat: ఉత్కంఠ కొనసాగింపు.. వినేశ్‍కు పతకంపై తీర్పు వాయిదా.. నిర్ణయం ఎప్పుడు రానుదంటే..!
Vinesh Phogat - Paris Olympics 2024: ఫైనల్ వరకు చేరి అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమెకు పారిస్ ఒలింపిక్స్ రజత పతకం ఇచ్చే విషయంపై తుదితీర్పును సీఏఎస్ వాయిదా వేసింది. నిర్ణయం ఎప్పుడు వెల్లడి కానుందంటే..
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‍కు పారిస్ ఒలింపిక్స్ 2024 రజత పతకం దక్కుతుందా లేదా అనే విషయంపై టెన్షన్ కొనసాగుతోంది. అద్భుత ఆటతీరుతో 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో ఫైనల్‍కు చేరిన వినేశ్‍పై అనర్హత వేటు పడింది. కనీసం రజతం ఖాయమనుకోగా.. అది కూడా రాలేదు. అయితే, అనర్హతను కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో సవాలు చేశారు వినేశ్ ఫొగాట్. అయితే, ఈ విషయంపై నేడు (ఆగస్టు 10) రావాల్సిన తుది తీర్పు వాయిదా పడింది.
వాయిదా ఎప్పటికంటే..
వినేశ్ ఫొగాట్ అప్పీల్‍పై తుది తీర్పును రేపటికి (ఆగస్టు 11) సీఏఎస్ వాయిదా వేసింది. భారత కాలమానం ప్రకారం రేపు సుమారు రాత్రి 9 గంటల 30 నిమిషాలోపు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో వినేశ్‍కు పారిస్ ఒలింపిక్స్ పతకంపై అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
వినేశ్ ఫొగాట్ అప్పీలుపై వాదనలు ముగిశాయని సీఏఎస్ వెల్లడించింది. నేడు ప్రకటించాల్సిన తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఒలింపిక్ క్రీడల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే సవాలు చేసేందుకు సీఏఎస్ అడ్‍హక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‍కు చేరిన తనపై అనర్హత వేటు వేయడంపై వినేశ్ సవాల్ చేశారు. సెమీఫైనల్ వరకు సరైన బరువుతోనే పోరాడి విజయాలు సాధించిన తనకు రావాల్సిన రజత పతకం ఇప్పించాలంటూ అప్పీల్ చేశారు.
సీఏఎస్‍లో వినేశ్ ఫొగాట్‍కు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆశాభావంతోనే ఉంది. వినేశ్ ఫొగాట్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సహా సంబంధిత విభాగాల తరఫున ఈ అంశంలో మూడు గంటల పాటు వాదనలు జరిగినట్టు వెల్లడించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమెరికాకు చెందిన సారా అన్ హిల్‍డెబ్రాంట్ స్వర్ణ పతకం గెలిచారు. వినేశ్‍పై అనర్హత వేటు పడటంతో ఆమెపై సెమీస్‍లో ఓడిన క్యూబా రెజ్లర్ గజ్‍మన్ లోపేజే ఫైనర్ ఆడారు. సారా చేతిలో ఓడి రజతం దక్కించుకున్నారు. అయితే, సెమీస్ వరకు గెలిచిన తనకు కూడా రజతం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‍ను ఆశ్రయించారు. వినేశ్‍కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.
వినేశ్ అద్భుత ప్రదర్శన
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ అద్భుత ప్రదర్శన చేశారు. ప్రీ-క్వార్టర్స్‌లో జపాన్‍కు చెందిన ప్రపంచ నంబర్ వన్ సీడ్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యూ సుసాకిని వినేశ్ చిత్తుచేశారు. 3-2తో మట్టికరిపించారు. అంతర్జాతీయ స్థాయిలో అజేయంగా ఉన్న సుసాకీని అద్భుత ఆటతీరుతో ఓడించారు వినేశ్. క్వార్టర్ ఫైనల్‍లో ఉక్రెయిన్ రెజ్లర్ ఒసాకా లివాచ్‍పై 7-5తో గెలిచారు వినేశ్ ఫొగాట్. సెమీస్‍కు దూసుకెళ్లారు. సెమీఫైనల్‍లో 5-0తో క్యూబా రెజ్లర్ జగ్‍మన్‍ను వినేశ్ ఓడించారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‍కు అర్హత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే, ఫైనల్‍లో తలపడే కొన్ని గంటల ముందు 50కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ఫైనల్‍లో తలపడేందుకు వినేశ్‍ను అనర్హురాలిగా ప్రకటించారు పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు. దీంతో వినేశ్‍కు రజతం కూడా దక్కలేదు. దీన్ని ఆమె సీఏఎస్‍లో సవాల్ చేశారు.