Vinesh Phogat brand value: ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ-vinesh phogat brand value star wrestler charging 1 crore for brand after paris olympics 2024 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vinesh Phogat Brand Value: ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ

Vinesh Phogat brand value: ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ

Hari Prasad S HT Telugu
Aug 22, 2024 01:25 PM IST

Vinesh Phogat brand value: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ రాకపోయినా.. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఆమె.. గతంలో కంటే ఇప్పుడు ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కు తీసుకుంటున్న మొత్తాన్ని నాలుగు రెట్లు పెంచేయడం విశేషం.

ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ
ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ (HT_PRINT)

Vinesh Phogat brand value: రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ పారిస్ ఒలింపిక్స్ తర్వాత అమాంతం పెరిగిపోయింది. మెడల్ కచ్చితంగా వస్తుందని అనుకున్నా.. ఫైనల్ కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నందుకు ఆమెపై అనర్హత వేటు వేశారు. అయితే ఇది ఆమెకు మరింత పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. స్వదేశంలో ఘన స్వాగతంతోపాటు ఆమె బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది.

వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ

ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ గత రెండు ఒలింపిక్స్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. ఈసారి కచ్చితంగా మెడల్ తెస్తుందన్న అంచనాల మధ్య బరిలోకి దిగి.. ఊహించినట్లే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. దురదృష్టవశాత్తూ అనర్హతతో మెడల్ రాకపోయినా.. అది ఆమె బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేసింది.

ఇంతకుముందు వరకు వినేశ్ ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి రూ.25 లక్షలు తీసుకునేది. కానీ పారిస్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత అది కాస్తా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పెరగినట్లు ఎకనమిక్ టైమ్స్ రిపోర్టు వెల్లడించింది. మెడల్ గెలవకపోయినా.. పారిస్ ఒలింపిక్స్ తో వినేశ్ క్రేజ్ మాత్రం మరో లెవల్ కు వెళ్లినట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది.

పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్

పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగాట్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్ మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. అంతకుముందు తొలి రౌండ్లోనే జపాన్ కు చెందిన ఒలింపిక్స్ డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకీపై గెలిచి ఆశ్చర్యపరిచింది. 2010 నుంచి అసలు ఓటమెరగని రెజ్లర్ ఆమె. అలాంటి ప్రత్యర్థిని మట్టి కరిపించడంతో వినేశ్ ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.

ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనూ స్ఫూర్తిదాయక విజయాలు సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఒకేరోజు మూడు బౌట్లలో తలపడటం వల్ల ఎక్కువ మొత్తంలో సప్లిమెంట్స్ తీసుకొని బరువు పెరిగింది. ఫైనల్ రోజు బరువు చూసే సమయానికి కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు వేశారు.

కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇప్పించాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ కు వెళ్లినా అక్కడా నిరాశే ఎదురైంది. అయితే తమ దృష్టిలో ఆమె మెడల్ గెలిచినట్లే అన్నట్లు వినేశ్ స్వదేశానికి రాగానే ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె ఊరు ఊరంత కదిలి రావడమే కాదు.. అందరూ కలిసి ఆమెకు ఓ భారీ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఇదే చరిష్మా వినేశ్ బ్రాండ్ వాల్యూను కూడా మూడు నుంచి నాలుగు రెట్ల పాటు పెంచేసింది. పారిస్ ఒలింపిక్స్ లో హార్ట్ బ్రేక్ తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన వినేశ్.. మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి.