Telugu News  /  Sports  /  Uthappa Wins Ilt20 Green Belt As He Became The First Player To Win This
గ్రీన్ బెల్ట్ తో రాబిన్ ఉతప్ప
గ్రీన్ బెల్ట్ తో రాబిన్ ఉతప్ప

Uthappa wins ILT20 Green Belt: ఐఎల్‌టీ20లో గ్రీన్‌బెల్ట్‌ గెలిచిన ఉతప్ప.. అసలేంటిది?

17 January 2023, 12:54 ISTHari Prasad S
17 January 2023, 12:54 IST

Uthappa wins ILT20 Green Belt: ఐఎల్‌టీ20లో గ్రీన్‌బెల్ట్‌ గెలిచాడు రాబిన్‌ ఉతప్ప. తొలిసారి జరుగుతున్న ఈ లీగ్‌లో ఈ బెల్ట్‌ గెలిచిన తొలి క్రికెటర్‌గా ఉతప్ప నిలిచాడు. మరి ఈ గ్రీన్‌ బెల్ట్‌ ఏంటి?

Uthappa wins ILT20 Green Belt: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20)లో గ్రీన్‌ బెల్ట్‌ గెలిచిన తొలి క్రికెటర్‌గా ఉతప్ప నిలిచాడు. సోమవారం (జనవరి 16) దుబాయ్‌ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన ఉతప్ప.. 46 బాల్స్‌లో 79 రన్స్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 122 రన్స్‌తో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు ఉతప్ప. దీంతో గ్రీన్‌బెల్ట్‌ అతని సొంతమైంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఆరెంజ్‌ క్యాప్‌, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్‌ క్యాప్‌ అందించినట్లే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఇలా బెల్ట్‌లు ఇస్తున్నారు. అత్యధిక పరుగులు చేసిన వారికి గ్రీన్‌ బెల్ట్‌ ఇస్తారు.

ఇదొక్కటే కాదు ఐఎల్‌టీ20లో మొత్తం ఐదు బెల్ట్‌లు ఉండటం విశేషం. గ్రీన్‌ బెల్ట్‌తోపాటు వైట్‌ బెల్ట్‌, బ్లాక్‌ బెల్ట్‌, రెడ్‌ బెల్ట్‌, బ్లూ బెల్ట్‌లు ఇవ్వనున్నారు. అత్యధిక పరుగులు చేసిన వాళ్లకు గ్రీన్‌ బెల్ట్‌ ఇచ్చినట్లే.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు వైట్‌ బెల్ట్‌ ఇస్తారు. ఇక ఐఎల్‌టీ20 ట్రోఫీ గెలిచిన టీమ్‌ ఓనర్‌కు బ్లాక్ బెల్ట్‌.. లీగ్‌లో మోస్ట్‌ వాల్యబుల్‌ ప్లేయర్‌కు రెడ్‌ బెల్ట్‌, లీగ్‌లోని బెస్ట్‌ యూఏఈ ప్లేయర్‌కు బ్లూ బెల్ట్‌ ఇస్తారు.

ఈ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో మొత్తం 24 మంది యూఏఈ ప్లేయర్స్‌ పార్టిసిపేట్‌ చేస్తున్నారు. వీళ్లలో సీజన్‌ మొత్తం ముగిసిన తర్వాత బెస్ట్‌ ప్లేయర్‌కు బ్లూ బెల్ట్‌ ఇవ్వనున్నారు నిర్వాహకులు. అయితే సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ మాత్రం ఈ బెల్ట్‌ల గోలేంటి? అసలు క్రికెట్‌ ఆడుతున్నారా లేక డబ్ల్యూడబ్ల్యూఈ ఆడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (WWE)లో విజేతలకు ఈ బెల్ట్‌లు ఇస్తారు. అయితే ప్రపంచంలోని మిగతా క్రికెట్‌ లీగ్స్‌ కంటే భిన్నంగా ఉండాలని చూస్తున్న ఐఎల్‌టీ20 ఇలా కొత్తగా బెల్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. మిగతా లీగ్స్‌తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు జనరల్‌ సెక్రటరీ ముబాషిర్‌ ఉస్మానీ చెప్పారు.

టాపిక్