RCBW vs UPW 2023: వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఆర్సీబీ.. యూపీ భారీ విజయం
RCBW vs UPW 2023: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీపై యూపీ వారియర్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అలీసా హేలీ 96 పరుగులతో అదరగొట్టింది.
RCBW vs UPW 2023: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇంత వరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోని ఆర్సీబీ మరో పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన యూపీ జట్టు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బెంగళూరుపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 138 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా 13 ఓవర్లలోనే ఛేదించింది. యూపీ ఓపెనర్లు అలీసా హేలీ 96 పరుగులతో విజృంభించింది. మరో ఓపెనర్ దేవికా వైద్య(36) నిలకడగా రాణించి అలీసాకు సహకరించింది. ఫలితంగా యూపీ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకోగా.. బెంగళూరు వరుసగా నాలుగో పరాజయంతో గెలుపు ఖాతాను తెలవలేకపోయింది.
ట్రెండింగ్ వార్తలు
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు అలీసా హేలీ, దేవికా వైద్య ఇద్దరూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అలీసా అర్ధశతకంతో అదరగొట్టింది. బెంగళూరు బౌలర్లే లక్ష్యంగా విధ్వంసం సృష్టించింది. వరుస పెట్టి బౌండరీలు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచింది. ఆమె ధాటికి లక్ష్యం ఇంకా చిన్నదైపోయింది. 47 బంతుల్లో 96 పరుగులు చేసింది.
మరోపక్క దేవికా వైద్య నిలకడగా రాణిస్తూ.. అలీసాకు సహకరించింది. వీరిద్దరి విజృంభణకు లక్ష్యం చిన్నదైపోయింది. 13 ఓవర్లలోనే కరిగిపోయింది. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసిన యూపీ ఓపెనర్లు తమ జట్టుకు భారీ విజయాన్ని అందించారు. బౌలర్లు ఏ సమయంలోనూ మెప్పించలేకపోవడంతో ఆర్సీబీ ఘోర ఓటమిని అందుకోవాల్సి వచ్చింది. దీంతో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది ఈ జట్టు.
మ్యాచ్ పరాజయానికి కెప్టెన్ స్మృతీ మంధానా తాను బాధ్యత వహిస్తానని తెలిపింది. "అంతర్జాతీయ క్రికెటర్లుగా మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. గత వారంగా పరిస్థితులు క్లిష్టతరంగా మారాయి. ఈ విషయాన్ని నేను అంగీకరించే తీరాలి. మా జట్టులో ప్లేయర్లందరితోనూ మాట్లాడానికి ప్రయత్నించాను. జట్టులో బ్యాలెన్స్ ఉండటం అవసరమని భావిస్తున్నాను" అని స్మృతి మంధానా స్పష్టం చేసింది.