Archana Devi Story : మంత్రగత్తె బిడ్డ అన్నారు.. ప్రపంచకప్ గెలిచింది.. ఇది కదా సక్సెస్-u19 world cup champion archana devi s mother savitri was called a witch here s painful story ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  U19 World Cup Champion Archana Devi's Mother Savitri Was Called A Witch Here's Painful Story

Archana Devi Story : మంత్రగత్తె బిడ్డ అన్నారు.. ప్రపంచకప్ గెలిచింది.. ఇది కదా సక్సెస్

Anand Sai HT Telugu
Jan 31, 2023 09:59 PM IST

U19 World Cup Champion Archana Devi : క్రికెటర్ అర్చనా దేవి సక్సెస్ కు ముందు ఎన్నో అవమానాలు.., ఎంతో మంది నుంచి సూటిపోటి మాటలు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అర్చనా.. మా అమ్మాయి.. మా ఊరి అమ్మాయి.. ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ అంతకుముందు తన జీవితంలో గుండెను కదిలించే కన్నీటిగాథ ఉంది.

అర్చనా దేవి
అర్చనా దేవి (twitter)

సక్సెస్ కు ముందు ఎవరూ నమ్మరు.. మనతో ఉండరు. ఒక్కసారి విజయంవైపు అడుగుపడితే చాలు అందరూ చుట్టాలే. ఊరంతా కుటుంబమే. అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది క్రికెటర్ అర్చనా దేవి. అదే ఊరు ఒకప్పుడు ఎన్నో మాటలతో గుండెల్లో గుచ్చింది. బయట అడుగుపెడితే.. ఎవరు ఏం అంటారోననే భయాన్ని పుట్టించింది. కానీ ఇప్పుడు వాళ్లే.. అర్చనా మా బిడ్డ. మా ఊరి ఆణిముత్యం అనేలా చేసింది. కష్టాలు.. ఊర్లో మాటలు.. వరల్డ్ కప్ గెలుపు వరకూ.. అర్చనను ప్రయాణించేలా చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

మహిళల అండర్ 19 ప్రపంచ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది షఫాలీ వర్మ జట్టు. ఈ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని అర్చనా దేవిది దీనమైన కథ. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. తనకు క్రికెట్ నేర్పిన చిన్న అన్నయ్య పాముకాటుతో మరణించాడు. అప్పుడు అర్చన చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి.

ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలోని రతై పూర్వ గ్రామంలోని నిరుపేద కుటుంబం నుంచి అండర్ 19 మహిళల వరల్డ్ కప్ వరకూ ప్రయాణం చేసింది అర్చనా దేవి. అన్నీ తానై.. అర్చన తల్లి సావిత్రి తోడుగా నిలిచింది. అబ్బాబ్బా.. ఎన్నెన్ని నిందలు పడిందో ఆ తల్లి. చుట్టూ ఉన్న వాళ్లు అనే మాటలు సూదుల్లా గుచ్చుకునేవి. 'కుమార్తెను ఎవరికో అమ్మేసింది.. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది.' ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది.

అయినా.. అవేమీ పట్టించుకోలేదు సావిత్రి. కుమార్తెను ఎలాగైనా క్రికెటర్ ను చేయాలని కలలు కన్నది. కష్టం చేసి.. అర్చనకు అండగా నిలబడింది.

అర్చనా దేవి ఊరు, పొలం నది ఒడ్డున ఉంటాయి. దీంతో వరదలతో ఆ పొలం మునకలోనే ఉండేది. అర్చన తండ్రి శివరామ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. 2008లోనే క్యాన్సర్ తో మరణించారు. ఇద్దరు కొడుకులు, కుమార్తెతో బతుకు పోరాటం మెుదలుపెట్టింది అర్చనా తల్లి సావిత్రి. విధి ఆడిన వింత నాటకంలో సావిత్రి చిన్న కుమారుడు.. బుద్ధిమాన్ చనిపోయాడు. ఇలాంటి ఘటనలు సావిత్రి జీవితంలో జరిగేసరికి.. ఊరంతా ఆమెను మంత్రగత్తె అని నిందలు వేశారు. నష్ట జాతకురాలు అని పిలిచేవారు. కొంతమందైతే.. సావిత్రి వస్తుంటే.. పక్కకు తప్పుకొనేవారు.

ఇలాంటి ఘటనలు చూసిన అర్చన తల్లి సావిత్రి.. ఇంకా రాటుదేలింది. పిల్లలను సరిగా చూసుకోవాలనుకుంది. ఓ రోజు అర్చనతో చిన్న అన్నయ్య బుద్ధిమాన్ పొలాల్లో క్రికెట్ ఆడుతున్నాడు. అర్చన టాలెంట్ ను మెుదట గుర్తించింది అతడే. నువ్వు క్రికెటర్ కావాలి అని చెప్పేవాడు. ఆమెకు ఆశ ఉంది.. కానీ ఇంట్లో పరిస్థితి సరిగా లేదు. దీంతో తల్లి సావిత్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఒక రోజు చెట్లలో పడిన బంతిని తీసేందుకు బుద్ధిమాన్ వెళ్లాడు. చేతులతో చెత్తను కదిలిస్తూ ఉండగా.. పాము కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటే.. అర్చనను క్రికెట్ మాన్పించొద్దంటూ.. బుద్ధిమాన్ చివరి మాటలు చెప్పాడు. ఆ తర్వాత చనిపోయాడు. అప్పుడే అర్చనను తల్లి సావిత్రి క్రికెటర్ చేయాలని బలంగా అనుకుంది. ఆటలను ప్రోత్సహించే గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ కు పంపింది. తమ ఊరికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నా వెనకడుగు వేయలేదు. ఈ సమయంలోనే చుట్టుపక్కల వారు.. కుమార్తెను అమ్మేసిందని.. మాటలు అనేవారు. తప్పుడు పనుల్లో చేర్పించిందని హింసించేవారు.

బోర్డింగ్ స్కూల్లోని ఓ టీచర్ అర్చను ప్రతిభను గమనించి.. కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఎవరో కాదు.. టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్. అర్చన ఆటను చూసిన పాండే.. ఆమెను దత్తత తీసుకున్నాడు. కుల్దీప్ కూడా శిక్షణ ఇచ్చేవాడు. అలా వరల్డ్ కప్ వరకూ అర్చనా దేవి ప్రయాణం సాగింది. ఒకప్పుడు అర్చన తల్లి సావిత్రి రోడ్డు మీద నడుస్తుంటే.. పక్కకు తప్పుకొన్నవారే.. ఇప్పుడు సావిత్రి ఇంటికి వస్తున్నారు. ఇది కదా ఆ తల్లికి కుమార్తె తెచ్చిన సక్సెస్.

WhatsApp channel